తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
టోకెన్ల జారీ నిలిపివేత
తిరుమల,మే23( జనం సాక్షి): తిరుమలకు భక్తులు పోటెత్తడంతో దర్శనం దుర్లభంగా మారింది. దీంతో ధర్మదర్వనం టోకెన్ల జారీ నిలిపివేశారు. శ్రీవారి భక్తుల రద్దీ అత్యధికంగా ఉన్నందున తిరుమలలో సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. గత వారం రోజులుగా యాత్రికుల రద్దీ గరిష్ఠ స్థాయిలో ఉందన్నారు. మంగళవారం మధ్యాహ్నం టోకెన్ పొందిన భక్తులకు శుక్రవారం ఉదయం 11 గంటలకు స్వామి దర్శనం లభించే అవకాశం ఉంది. అంటే దాదాపు 3 రోజులు భక్తులు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో.. టోకెన్ల జారీని తాత్కాలికంగా తిరుపతికే పరిమితం చేయాలని నిర్ణయించామ’ని వివరించారు. ఈనెల 3 నుంచి పూర్తి స్థాయిలో టోకెన్ల జారీని ప్రారంభించగా ఆదివారం వరకు 5,43,308 మంది తీసుకున్నారని, వీరిలో 4,02,011 మంది వినియోగించుకున్నట్లు తెలిపారు. సర్వదర్శనం భక్తుల క్యూలైను ప్రవేశాన్ని ఇకపై లేపాక్షి ఎంపోరియం ఎదుటకు మార్చుతున్నట్లు తెలిపారు.వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకున్న వేళ వారం రోజులుగా వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం దాదాపు 2 లక్షల మంది యాత్రికులు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పడిగాపులు పడుతున్నారు. ఆదివారం టోకెన్లు తీసుకున్న యాత్రికులకు మంగళవారం స్వామివారి దర్శనం కలిగింది. టోకెన్‌పై నిర్దేశిరచిన సమయానికి క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశిస్తే.. వారికి 4 గంటల వ్యవధిలో శ్రీవారి దర్శనం పూర్తి అవుతోంది. మంగళవారం మధ్యాహ్నం తర్వాత వచ్చిన భక్తులకు ఇచ్చిన టోకెన్లపై.. శుక్రవారం మధ్యాహ్నం తర్వాతే దర్శన సమయం పేర్కొనడం గమనార్హం. సుమారు 2రోజుల తర్వాత కాని వరుసల్లోకి ప్రవేశించే వీల్లేదు. సర్వదర్శనం వరుసల్లోకి వెళ్లినా.. తిరిగి బయటకు వచ్చేందుకు రెండు రోజుల సమయం పడుతోంది. మరోవైపు, తిరుమలలో అద్దె గదులు లభించక వేలాదిమంది భక్తులు ఆరుబయటే సేదతీరుతున్నారు. సత్రాలు, మఠాలు, ఉద్యానవనాలు, రోడ్ల పక్కన, షాపింగ్ కాంప్లెక్సుల ముందు.. ఎక్కడ చూసినా భక్తులు కిటకిటలాడుతూ కనిపించారు. సోమవారం 85 వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి 70 వేల మందికి దర్శనభాగ్యం లభించింది. మంగళవారం 49 వేల మంది భక్తులు
తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.82 కోట్ల మేర వచ్చింది.
—-