తిరుమల భక్తులపై భానుడి భగభగలు

తిరుపతిలో తీవ్రంగా ఎండల తీవ్రత
తిరుపతి,మే24(జ‌నం సాక్షి): తిరుమలకు భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. దీనికితోడు మండుతున్న ఎండలు కొండకింద చేరుకున్న భక్తులను ఇబ్బంది పెడుతోంది. తిరుమలో సేదదీరుదామన్నా గతంలో కన్నా ఇక్కడా ఎండలు మండుతున్నాయి. గదులు దొరక్క ఆరుబయటే పడిగాపులు పడుతున్నారు. బస్సులు, రైళ్లు దిగిన ప్రయాణికులకు తిరుపతి  నిప్పుల కొలిమిలా మారింది. తీవ్ర ఉష్ణోగ్రతలతో తిరుమలకు వస్తోన్న యాత్రికులు ముప్పు తిప్పలు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండల తీవ్రతకు వేడిగాలులు తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఎండ తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు యాత్రికులు తండోపతండాలుగా తరలివస్తున్నప్పటికీ తితిదే అధికారులు, సిబ్బంది కలిసి విశేష సేవలందిస్తున్నారని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో భక్తకోటికి మరింతగా సేవలు విస్తరించాలని ఆదేశించారు.  అభివృద్ధి పనులు, యాత్రికుల రద్దీ, అందిస్తున్న సేవలపై సమగ్రంగా సవిూక్షించారు. యాత్రికుల రద్దీ మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు తరలివస్తున్నట్లు గుర్తు చేశారు. తిరుమల క్షేత్రం భక్తకోటితో కిటకిటలాడుతోంది. యాత్రికుల రద్దీ అనూహ్యంగా పెరుగుతూనే ఉంది. మరిన్ని రోజులూ ఈ తాకిడి కొనసాగే అవకాశాలున్నాయి. అద్దె గదులు కేటాయించే కార్యాలయాలు, నిత్య అన్నప్రసాదం సముదాయం, కల్యాణకట్టలు, లడ్డూ ప్రసాద వితరణశాలల వద్ద యాత్రికులు కిక్కిరిసి ఉన్నారు. తిరువీధులన్నీ కదలడానికి వీల్లేని విధంగా కిటకిటలాడుతున్నాయి. భక్తులకు దేవస్థానం తరఫున సేవలందించడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. తిరుమల జేఈవో శ్రీనివాసరాజు అధికారులతో కలిసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తిరుమలకు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం భక్తులు పాట్లు పడుతున్నారు. సామర్థ్యాని కంటే అధికంగా భక్తులు తరలిరావడంతో దర్శనంతో పాటు అన్ని రకాల సేవలకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఇకపోతే తీవ్ర ఉక్కపోత కారణంగా సాయంత్రం వేళల్లో ఇళ్లలో ఉండలేక ఆరు బయటే సేదదీరుతున్నారు. ఇక స్థానికంగా ఉంటున్న వారు ఇళ్లల్లోంచి బయటకు రావడానికి మహిళలు, వృద్ధులు, చిన్నారులు భయపడుతున్నారు. భానుడి భగభగలకు రహదారులు వేడెక్కి పోయాయి. రోడ్డు కక్కుతున్న సెగలకు వాహన చోదకులు ఉక్కిరి బిక్కిరయ్యారు. వేడి గాలుల ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. గత నెల చివరి వారం తోపాటు ఈ నెల మొదటి వారంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ద్రోణి కారణంగా జిల్లాలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.  ఇక రాత్రి వేళల్లో ఫ్యాన్లు, కూలర్లు పని చేస్తున్నా జనం ఉక్కపోత నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారు. ఎండ కారణంగా చిరు వ్యాపారులు, కూలీలు, పాదచారులు, కాపరులు, వాహనచోదకులు విలవిలలాడిపోయారు. ఎండలు మండుతుండడంతో ప్రధాన వ్యాపార సముదాయాల రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. గ్రావిూణ ప్రాంతాల్లో పశువులు, గొర్రెల కాపరులు ఇంటికే పరిమితమయ్యారు.