తిరుమల వ్యవహారంలో విచారణ చేయండి
హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు
హైదరాబాద్,మే22(జనం సాక్షి): టిటిడిలో వివాదాలపై విచారణ జరపాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ సిబిఐకి ఫిర్యాదు చేశారు. శ్రీవారి ఆస్తుల రికార్డుల తారుమారుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రమణ దీక్షితులు ఆరోపణలపై సిబిఐ విచారణ చేయాలని కోరారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్ నరసింహన్ తిరుపతి వివాదంలో కలుగచేసుకోవాలని లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. నాణెళిల ద్వారా వజ్రం పగిలిందనడంలో నిజం లేదని, స్వామి వారి భూములు, నిధులు, నగలు, బ్యాంక్ డిపాజిట్ల లెక్కలు బహిర్గతం చేయాలని అరుణ్ లేఖలో పేర్కొన్నారు. తమపై చర్యలు తీసుకునే అధికారం టిటిడికి లేదని రమణ దీక్షితులు తెలిపిన విషయం తెలిసిందే. 143 చట్టం ప్రకారం తమకు మిరాశిలో వచ్చే ఆదాయం మాత్రమే రద్దయిందని, వంశపారంపర్యం, సంభావన, గౌరవంగా చూడాలని సుప్రీం తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కోర్టు నిర్ణయాలనూ టిటిడి పెద్దలు లెక్కచేయడం లేదని మండిపడ్డారు. మిరాశి అర్చకులను హీనంగా చూసినా సహించామని, కానీ కైంకర్యాలలో లోపాలు జరిగితే ఊరుకోమని మండిపడ్డారు. విఐపిల సేవలో టిటిడి తరిస్తూ తమపై పెత్తనం చెలాయిస్తోందని, నిత్యసేవలు త్వరగా నిర్వహించాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని రమణ దీక్షతులు పలు ఆరోపణలు చేసిన విషయం విదితమే.