దక్షిణాదిలో పాగాతో ప్రాంతీయ పార్టీలపై పెత్తనం
కర్నాటకలో బెడిసి కొట్టిన బిజెపి వ్యూహం
జగన్, గాలి బీజేపీకి ప్రధాన వ్యక్తులు
– ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేలా బీజేపీ వ్యవహరిస్తుంది
ఎపిలో అభివృద్దిని పట్టించుకోని బిజెపి
చంద్రబాబు విజన్‌తో రాష్ట్రాన్ని ముందున నిలబెట్టాం
కావలి మినీ మహానాడులో సోమిరెడ్డి
నెల్లూరు,మే22(జనం సాక్షి ): తప్పుడు విధానాలతో అయినా కర్ణాటకలో అడుగుపెడితే… మిగిలిన రాష్ట్రాల్లో కూడా పెత్తనం చెలాయించవచ్చునే భావనతో బీజేపీ ఉందని ఎపి వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్ విూద ప్రేమ పెంచుకున్న మోదీ ఏపీ ప్రజలపై కక్ష చూపుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్‌ను సజావుగా నడపలేని స్థితిలో బీజేపీ ఉందన్నారు, కావలిలో టిడిపి మినీమహానాలో ఆయమన మాట్లాడారు. దేశంలో నల్లధనం లేకుండా చేయడంతో పాటు విదేశాల్లో దాచిపెట్టిన డబ్బు తెచ్చి పేదలకు పంచుతానని ప్రగల్భాలు పలికిన మోదీ ఇప్పుడు ఏం చేస్తున్నారు.. సీఎంఎస్ సర్వే ప్రకారం బీజేపీ పెద్దలు కర్ణాటక ఎన్నికల్లో రూ.10,500 కోట్లు ఖర్చు పెట్టి దేశంలో సామాన్యులకు ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకుండా చేశారన్నారు. కర్ణాటకలో అప్రజాస్వామిక చర్యలకు బీజేపీనే బాధ్యత వహించాలని మంత్రి అన్నారు. గాలి జనార్థన్ రెడ్డి బేరసారాల టేపులపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్, గాలి జనార్దన్ రెడ్డి బీజేపీకి ప్రధాన వ్యక్తులుగా మారారని ఆయన అన్నారు. కర్ణాటకలో బీజేపీ వ్యవహరించిన తీరు చూస్తుంటే… ఇటువంటి ప్రమాదం భవిష్యత్తులో ఎక్కువ ఉంటుందనే భావన కలుగుతుందని అన్నారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడానికి బీజేపీ పూనుకున్నట్లుగా కనిపిస్తుందని యనమల పేర్కొన్నారు. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించు కోవడమే బీజేపీ విధానంగా కనిపిస్తోందని అన్నారు.దక్షిణాదిలో కూడా అడుగుపెట్టాలని చూస్తోందని, అందుకు తగిన విధంగా కర్ణాటక ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పారని అన్నారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాల్సి అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో బీజేపీ అవకాశం లేదని, ఆ అవకాశాన్ని బీజేపీనే కోల్పోయిందన్నారు. విభజన హావిూలను నెరవేర్చి ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఉంటే తెదేపాతో పాటు బీజేపీకి కూడా క్రెడిట్ వచ్చేందన్నారు. కానీ చంద్రబాబు ఎంతో వ్యయప్రయాసల కోర్చి రాజధాని నిర్మాణం, పోలవరంతో పాటు అన్ని రంగాల్లో ఏపీని అభివృద్ధి చేయాలనే దృక్పదంతో ముందుకు సాగుతుంటే బీజేపీ నిధులు విడుదల చేయకుండా, విభజన చట్టంలోని హావిూలను అమలు చేయకుండా ఏపీని మరింత దుర్భర స్థితిలోకి నెట్టేలా చూసిందన్నారు. కానీ చంద్రబాబు తన అనుభవంతో ఏపీని కొంతమేర గట్టెక్కించగలిగారన్నారు. తెలుగు జాతి ఉన్నంతవరకు తెలుగుదేశం
పార్టీ శాశ్వతంగా ఉంటుందన్నారు. కావలి అంటేనే టీడీపీ కార్యకర్తలతో కళకళలాడు తుంటుంది.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో క్రాప్ హాలిడే, పవర్ హాలిడేలు చూశాం..ఇలాంటి పరిస్థితుల్లో లోటు బ్జడెట్ తో అధికారం చేపట్టిన చంద్రబాబు ఇళ్లకు, పరిశ్రమలకు నిరంతరం, వ్యవసాయానికి పగలే ఏడు గంటలు విద్యుత్ అందించి చరిత్ర సృష్టిస్తున్నారని సోమిరెడ్డి అన్నారు. తండ్రి పాలనలో ప్రతి సంతకానికి ఇంత..అని రేటు పెట్టి.. క్విడ్ ప్రోకో వంటి కొత్త పదాలను రాష్ట్రానికి పరిచయం చేసిన చరిత్ర జగన్ ది..రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల విషయంలో పొరుగునున్న ధనిక రాష్ట్రాల కంటే ఎంతో ముందున్నాం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా రైతుల ప్రయోజనాల విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడటం లేదు.. కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినా కనీస మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేస్తున్నాం..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 90 శాతం వరకు పంటలను కనీస మద్దతు ధరకే కొనుగోలు చేస్తూ మిగిలిన రాష్ట్రాలపై వివక్ష చూపుతూ 30, 40 శాతం పంటను కొనుగోలు చేయడం లేదు..జిల్లాలో పంటలు పండించడమే కాదు..ఎన్‌ఎల్‌ఆర్ 34449 గ్రేడ్ సమస్యను పరిష్కరించడంతో పాటు బీపీటీలకు క్వింటాలుకు రూ.210 బోనస్ ప్రకటించి ఇప్పటి వరకు 2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి అన్నారు. 2106లోనూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 3.50 లక్షల టన్నులు సేకరించిన చరిత్ర మాది..? గత ప్రభుత్వ హయాంలో ధాన్యానికి బోనస్ ప్రకటించినప్పటికీ ఒక్క క్వింటా కొనుగోలు చేయలేదు.. పెండింగ్ లో ఉన్న అటవీ అనుమతులు తెచ్చి తెలుగుగంగ కింద లక్షా పదివేల ఎకరాలను అదనంగా సాగులోకి తేవడంతో పాటు రివైజ్డ్ ఎస్టిమేస్ట్స్ కి అనుమతులు తెచ్చి ఆగిపోయిన పనులు ముందుకు సాగేలా చేసిన చరిత్ర మాది.. సోమశిలలో 78 టీఎంసీలు నిల్వ చేయడానికి ఉన్నతాధికారులతో సవిూక్ష నిర్వహించి అవసరమైన చర్యలు చేపట్టాం.. గత ప్రభుత్వ హయాంలో పునాదులు వేసి వదిలేసిన సంగం, నెల్లూరు బ్యారేజీ పనులను త్వరితగతిన చేస్తూ ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నాం.. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు అవసరమైన పరికరాలు సబ్సిడీపై అందజేయడంతో పాటు రైతురథం పథకం అమలు చేసి 12, 800 ట్రాక్టర్లను రైతులకు సబ్సిడీపై అందజేశాం.. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్న వైకాపా నేతలు అధికారం వెలగబెట్టినప్పుడు ఏం చేశారు..ఏనాడైనా రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించారా..రైతుల సమస్యల పరిష్కారం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు..అలుపెరగక శక్తికి మించి రైతుల కోసం పనిచేస్తున్నాం అని సోమిరెడ్డి అన్నారు. కావలిలోని బృందావనం కళ్యాణ మండపంలో టీడీపీ పతాకాన్ని ఆవిష్కరించడంతో పాటు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కావలి నియోజకవర్గ మినీ మహానాడును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో కావలి నియోజకవర్గ ఇన్ చార్జి, సీఆర్డీఏ సభ్యుడు బీద మస్తాన్ రావు , ఎన్డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి , మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి అలేఖ్య , నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి , కందుకూరు ఇన్ చార్జి దివి శివరాం , పరిశీలకులు ఎరిక్సన్ బాబు , ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.