దసరా సెలవుల వరకు ఆగండి

– సచీవాలయం కూల్చివేత,మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌
– దసరా సెలవుల తర్వాత విచారణ చేపడతామని వెల్లడి
హైదరాబాద్‌,అక్టోబర్‌ 1 (జనంసాక్షి):టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి హైకోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతకు తెలంగాణ హైకోర్టు నో చెప్పింది. సచివాలయం కూల్చివేత పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు సచివాలయ భవనాలను కూల్చొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది. కొత్త సచివాలయనిర్మాణం కోసం ఉన్న సచివాలయంలో భవనాలు కూల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సచివాలయాన్ని ఖాళీ చేయించింది. అయితే కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణంపై మంత్రివర్గ ఉపవర్గం సమర్పించిన నివేదికను నేడు తెలంగాణ కేబినెట్‌ ఆమోదించనున్న వార్తల నేపథ్యంలో కోర్టు ఈ తీర్పు వెలువడటం గమనార్హం. కేబినెట్‌ భేటీ అనంతరం సచివాలయ భవనాల కూల్చివేత, కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టాలని భావించిన కేసీఆర్‌ సర్కార్‌కు కోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. ఇప్పటికే అసెంబ్లీ భవనాల నిర్మాణాల కోసం ఎర్రమంజిల్‌ భవనాలను కూల్చాలన్న నిర్ణయానికి కూడా కోర్టు పగ్గాలు వేసింది. ఆ భవనాలను కూల్చొద్దని ఆదేశించింది. దీంతో ఇప్పుడు సచివాలయంతో పాటు,అసెంబ్లీల నిర్మాణాలకు బ్రేక్‌ పడింది. అలాగే మున్సిపల్‌ ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌ తేలేంత వరకు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఎన్నికల కమిషన్‌ పాటించిన విధానాన్ని పాటించాలని సూచించింది. అలాగే ఎన్నికల ముందు జరిగే పక్రియ మొత్తం పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. దసరా సెలవుల తర్వాత దీనిపై విచారణ చేపట్టనున్నట్టు కోర్టు తెలిపింది. హైకోర్టుకు దసరా సెలవుల నేపథ్యంలో కేసుల విచారణకు అత్యవసర బెంచ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ తెలిపారు. ఈ నెల 9,10 తేదీలలో డివిజన్‌ బెంచ్‌, సింగిల్‌ బెంచ్‌ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. కాగా, దసరా పండుగ సందర్భంగా ఈ నెల 3 నుంచి 11 వరకు హైకోర్టుకు సెలవులు ఉంటాయని హైకోర్టు రిజిస్ట్రార్‌  జనరల్‌ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకూ బ్రేక్‌
మునిసిపల్‌ ఎన్నికల విషయంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేంతవరకు నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇక ఎన్నికలకు సంబంధించి మాత్రం గతంలో ఎన్నికల కమిషన్‌ చెప్పిన విధానాన్నే పాటించాలని స్పష్టం చేసింది. ప్రీ ఎలక్షన్స్‌ ప్రాసెస్‌ మొత్తం పూర్తి చేసుకునేందుకు అనుమతించింది. కాగా… ఎన్నికల నిర్వహణకు సంబంధించి దసరా సెలవుల అనంతరం హైకోర్టు మరోమారు విచారించనుంది.అప్పటి వరకు మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రకటనా ఉండబోదు.

తాజావార్తలు