దాచేపల్లిలో మరో అకృత్యం
– 12 ఏళ్ల బాలికపై కో ఆప్షన్ సభ్యుడి అత్యాచారం
– నెల్లూరు, హైదరాబాద్‌ల్లోనూ ఘటనలు
దాచేపల్లి, మే12(జనం సాక్షి ) : గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన నుంచి తేరుకోకముందే అలాంటిదే మరో ఘోరం వెలుగుచూసింది. 12 ఏళ్ల బాలికపై దాచేపల్లి మండల కోఆప్షన్ సభ్యుడు మహబూబ్ వలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం
గురజాల ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఇటీవల దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై 60ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. నిందితుడిని త్వరగా పట్టుకుని శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. దీంతో భయపడిన నిందితుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం బాధితురాలికి ఆర్థిక సాయం ప్రకటించిన చంద్రబాబు.. ఆమెను తన సొంత ఖర్చుతో చదివిస్తాననని హావిూ ఇచ్చారు. రాష్ట్రంలో చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి అదే చివరి రోజు కావాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్టాన్ని కుదిపేసిన ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే అదే పట్టణంలో అలాంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం.
నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఐదేళ్ల చిన్నారిపై గురుస్వామి అనే వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. చాక్లెట్లు, బిస్కెట్లు కొనిస్తానంటూ తీసుకెళ్లి అఘాయిత్యం జరుపబోగా.. చిన్నారి నానమ్మ గమనించింది. చేసినతప్పుకు ప్రతిగా ఐదు కేజీల బియ్యం ఇచ్చి తప్పించుకోవాలని చూశాడా కీచకుడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడు గురుస్వామిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లోని విూర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల లెనిన్ నగర్‌లో దారుణం వెలుగుచూసింది. 12 ఏళ్ల విద్యార్థినిపై ఆమెకు పాఠాలు చెప్పే ట్యూటర్ గోపి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్రరక్తస్రావం అవుతున్న స్థితిలో బాలికను తల్లిదండ్రులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ట్యూటర్ గోపి.. గడిచిన నాలుగు నెలలుగా బాలికపై అత్యాచారం జరుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.