దునియాకా దిల్‌పసంద్‌ హైదరాబాద్‌ బిర్యాణీ

– ప్రపంచంలోనే తెలుగు భాష గొప్పది
– మహామహులంతా తెలుగువారే కావడం గర్వకారణం
– హైదరాబాద్‌ అంటే బిర్యానీ, బ్యాడ్మింటన్‌, బాహుబలి
– ముగింపువేడుకల్లో ప్రజలకు రాష్ట్రపతి అభినందనలు
– తెలుగుభాషాభివృద్ధికి జనవరిలో ప్రణాళిక
-సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌,డిసెంబర్‌ 19,(జనంసాక్షి): ప్రపంచ తెలుగు మహాసభల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలుగుపై ప్రశంసలు గుప్పించారు. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అంటూ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.  ప్రపంచంలోనే తెలుగు భాష గొప్పదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని ఆయన తెలిపారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కోవింద్‌ పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగులో సోదర.. సోదరీమణుల్లారా.. అని తన ఉపన్యాసాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి కోవింద్‌.. ఈ సభలు నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యంలో కేసీఆర్‌కు మంచి పట్టు ఉందన్నారు. దేశంలో ఇప్పటి వరకు రాష్ట్రపతిగా పనిచేసినవారిలో ముగ్గురు తెలుగువారే అని గుర్తుచేశారు. తెలుగు భాషకు ఎంతో విశిష్టత ఉందని, దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు అని అన్నారు. ప్రపంచం నలుమూలలా తెలుగువారు ఖ్యాతి పొందారన్నారు. దివంగత ప్రధాని పివి నరసింహారావు తెలుగు వాడు కాడమే గాకుండా బహుభాషా కోవిదుడని కితాబునిచ్చారు.  హైదరాబాద్‌ అంటే బిర్యానీ, బ్యాడ్మింటన్‌, బాహుబలి అని పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చానని చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు హాజరైనందుకు సంతోషంగా ఉందన్నారు. తెలుగు భాష అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. దేశ, విదేశాల నుంచి ఈ సభలకు హాజరైన వారందరికీ అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా తెలుగు భాష మాట్లాడుతారని రాష్ట్రపతి తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి గురజాడ అప్పారావు విశేష కృషి చేశారని గుర్తు చేశారు. తన కంటే ముందు ముగ్గురు తెలుగువారు రాష్ట్రపతులయ్యారు. తెలుగు తెలిసిన
రాష్ట్రపతుల్లో సర్వేపల్లి, వివి గిరి, సంజీవరెడ్డి ఉన్నారని చెప్పారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా తెలుగువారే అని రాష్ట్రపతి పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో తెలుగు వారి త్యాగాలు మరువలేనివి. అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటం చేశారని తెలిపారు.
విజయవంతంగా ముగిసిన తెలుగు భాషా సంబరం
ఐదు రోజుల సంబరం ఐదు క్షణాల్లో ముగిసిందన్న రీతిలో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ముగిశాయి. ఐదు రోజులు అలవోకగా గడిచాయి. ఆనంద క్షణాలు వెంట తీసుకుని ఆహుతులు తమ గమ్యానికి బయలుదేరారు. అంగరంగ వైభవంగా మొదలైన ఈ సభలు అంబరాన్నంటిన సంతసంగా ముగిసిన తీరు ఆహుతులను అచ్చెరువొందేలా చేశాయి. ఎక్కడా ఎలాంటి అపశృతి లేకుండా మ¬న్నతంగా ముగిసిన తీరు తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను అంబరాన్ని అంటేలా చేసింది. ఆరంభంలోనూ, ముగింపులోనూ తారాజువ్వల సవ్వడి మిరుమిట్లు గొలిపి దీపావళి దివ్వెలను వెలగించాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చి ప్రజలకు శుభాభినందనలు అందచేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభారంభాన్ని ఇవ్వగా సిఎం కెసిఆర్‌ కనుసన్నల్లో ఆద్యంతం ఈ ఉత్సవాలు దసరా సంబరాలను గుర్తుకు తెచ్చేలా చేశాయి. బతుకమ్మ, దసరా సంబరాలు ఇప్పుడే వచ్చాయన్న రీతిలో నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో అంబరాన్నంటాయి.  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపుతో అంతా భారంగా వేదికను వీడారు.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాహితీ గోష్టులు, అవధానాలు,చర్చలు ఆద్యంతం ఆసక్తిని కలిపించాయి. ముగింపు వేడుకలు అత్యంత వైభవోపేతంగా కొనసాగాయి. తెలంగాణ విశిష్టతను తెలిపే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ముగింపు వేడుకలను వీక్షించేందుకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి భాషాభిమానులు భారీ స్థాయిలో తరలివచ్చారు. తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలుగు రాష్టాల్ర గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ సాహిత్య అకాడవిూ ఛైర్మన్‌ నందిని సిధారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఐదు రోజుల పాటు ఎల్బీ స్టేడియం, రవీంద్రభారతి సహా వివిధ వేదికల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, అవధానాలు, సాహితీ సదస్సులు, చర్చాగోష్ఠిలు ఆకట్టుకున్నాయి. ముగింపు వేడుకల్లో భాగంగా ప్రధాన వేదికపై పేరిణి నృత్యం, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే లఘుచిత్రం ప్రదర్శించారు. దేశ విదేశాలతో పాటు రాష్ట్ర నలుమూల నుంచి తెలుగు భాషాభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎల్బీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించుకోవడం తెలుగు ప్రజలకు గొప్ప పండుగ అని తెలంగాణ సాహిత్య అకాడవిూ చైర్మన్‌ నందిని సిద్దారెడ్డి పేర్కొన్నారు. తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సిద్దారెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. తెలుగు మహాసభలు రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ఈ ఐదు రోజుల పాటు నిర్విరామంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు, అవధానాలు జరిగాయి. ఈ మహాసభలకు 42 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలు వర్ధిల్లాలని సిద్దారెడ్డి చెప్పారు. తెలుగు మహాసభల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించాయని ఆయన తెలిపారు. ఇకపోతే ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు పాట మారుమోగింది.ది. టాలీవుడ్‌ తారలు నటించిన ఓ పాట.. తెలంగాణ గొప్పతనాన్ని వర్ణిస్తూ సాగుతోంది. తెలుగు భాషా కవులు, రచయితలు, శాసనాల గురించి వివరిస్తూ ఆ పాట సాగిన వైనం అద్భుతం. వరుణ్‌తేజ్‌, లావణ్య, సాయి ధరమ్‌తేజ్‌, హరిశ్‌ ఈ పాటలో నటించారు. సాయి కార్తీక్‌ ఈ పాటకు సంగీతం అందించారు. డైరక్టర్‌ వంశీ పైడిపల్ల పాత్ర కూడా ఈ పాటలో ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని పాటలను చిత్రీకరించింది. బతుకమ్మ, తెలుగుభాష ఔన్నత్యానికి కృషి చేసిన కవులు, రచయితపై రూపొందించిన పాటలు అలరించాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో ఓ పాటను చిత్రీకరించారు. ¬లీ నేపథ్యంలో సాగే ఆ పాట కూడా విశేషంగా అలరిస్తోంది.

తెలుగుభాషాభివృద్ధికి జనవరిలో ప్రణాళిక
-సీఎం కేసీఆర్‌
తెలుగును కాపాడుకోవాలన్న మహాసభల నుంచి వచ్చిన వినతి మేరకు ఇక నుంచి ప్రతియేటా డిసెంబర్‌లో తెలంగాణ తెలుగు మహాసభలనునిర్వహిస్తామని సిఎం కెసిఆర్‌ ప్రకటించారు. అలాగే తెలుగు అబ్యున్నతికి వచ్చిన వినతులను పరిశీలించి జనవరిలో సామితీవేత్తలతో సమావేశమవుతామని, అప్పుడే కీలక నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించిందని ముఖ్యమంత్రి  అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవంగా తెలుగు మహాసభలు నిర్వహించుకొని ప్రపంచానికి చాటిచెప్పామని తెలిపారు. ఇక నుంచి ప్రతీ ఏడాది డిసెంబర్‌ మొదటి వారంలో రెండు రోజుల పాటు వైభవంగా తెలంగాణ తెలుగు మహాసభలు నిర్వహిస్తామని  సీఎం ప్రకటించారు. తెలుగు మహాసభల ముగింపు వేడులకు హాజరైన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు రాష్ట్ర ప్రజల తరపున సీఎం ధన్యవాదాలు తెలిపారు.  తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలుగు మహాసభలను సుసంపన్నం చేసినందుకు ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సభలు విజయవంతమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. 1974లో డిగ్రీ విద్యార్థిగా ఇదే స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరై తిలకించాను అని సీఎం గుర్తు చేశారు. తెలుగు మహాసభలు గొప్పగా నిర్వహించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత ఈ సభలను ఎలా నిర్వహిస్తామో అన్న శంక లేకుండా అత్యంత గౌరవంగా నిర్వహించుకోవడం గర్వ కారణమన్నారు. తెలుగు భాషను బతికించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు భాషను బతికించుకునేందుకు నిబద్ధతతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. ప్రతీ ఏటా రెండు రోజుల పాటు డిసెంబర్‌ నెలలో తెలంగాణ తెలుగు మహాసభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేయాలన్న నిబంధనను అమలు చేస్తామని ఉద్ఘాటించారు. ఈ గడ్డ విూద చదువుకోవాలంటే తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. భాషా పండితుల సమస్యలను పరిష్కారిస్తామని చెప్పారు. పదవీ విరమణ పొందిన భాషా పండితుల భృతి కోతను ఎత్తేస్తామని ప్రకటించారు. భాషా పండిత మిత్రులకు ఇచ్చిన హావిూని తప్పకుండా నెరవేరుస్తామని ఉద్ఘాటించారు. తెలుగు భాష అభివృద్ధి కొరకు, ఒక అద్భుతమైన జీవ భాషగా తీర్చిదిద్దడానికి కావాల్సిన ప్రకటనలు చేయాలని భావించాను. కానీ ఇప్పుడు ప్రకటన చేయలేక పోతున్నామని సీఎం తెలిపారు. ఈ మహాసభల సందర్భంగా తెలుగు భాషాభివృద్ధి విషయంలో వందల, వేల సూచలను వచ్చాయన్నారు. జనవరి మొదటి వారంలో భాషా సాహితీ సదస్సు నిర్వహించి భాషాభివృద్ధి ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు.  తెలుగు మహాసభలను సంతోషంగా నిర్వహించుకొని గొప్పగా ముందుకు వెళ్లామని తెలిపారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి.. ప్రతీ ఒక్కరూ సభలను విజయవంతం చేసేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎదురైన సమస్యలను వచ్చే సభల్లో రానివ్వమని స్పష్టం చేశారు. నేను చెప్పిన పద్యాలకు పలువురు నన్ను అభినందించారు. ఒక నవ్వుల పద్యంతో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను అని ఆ పద్యం చదివి వినిపించి సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.

తాజావార్తలు