నగర రోడ్ల విస్తరణతో మారిన పరిస్థితి
అందంగా అభివృద్ది చేస్తామన్న పురపాలక శాఖ
ఏలూరు,మే24(జనం సాక్షి): ఏలూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు అందరి సహకారంతో ఆక్రమణలు తొలగించారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ సమస్య కాస్తా తగ్గింది. ఇకపోతే మాదేపల్లి రోడ్డు, చాటపర్రు రోడ్డు, తంగెళ్లమూడి, పత్తేబాద తదితర ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టి యుద్ధప్రాతిపదికపై రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా తాను ముందుకు సాగుతానని, ఈ విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని నగరపాలక అధికారులు చెప్పారు. నగరంలో ఆధునిక మ్యూజియంను ఏర్పాటుచేస్తున్నామని, వెంకన్న చెరువు శ్మశానవాటికను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. స్మార్ట్ సిటీ ఏర్పాటుతోపాటు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ఇదిలావుంటే ఏలూరు కాలువను ఆర్నెల్లలో పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బడేటి బుజ్జి చెప్పారు. ఏలూరు అంటే మురికి కూపం అన్న పరిస్థితిని తొలగించి పర్యాటక హబ్‌గా ఏలూరును ప్రజలు మెచ్చే రీతిలో తీర్చిదిద్దుతానన్నారు. ఏలూరు కృష్ణకాలువ వెంబడి వున్న ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించడం జరిగిందని, రానున్న రోజుల్లో పూర్తి గ్రీనరీతో పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఏలూరు కాలువ ఆధునీకరణకు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని, త్వరలో నిధులు రానున్నాయని, రానున్న రెండునెలల్లో కాలువ ప్రాంతాన్ని పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దే పనులు చేపట్టి ఆర్నెల్లలో పూర్తి చేస్తామన్నారు.