నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన తితిదే ఉద్యోగులు

– రమణ దీక్షితుల ఆరోపణలపై నిరసన
తిరుమల, మే24(జ‌నం సాక్షి) : తిరుమలలో నెలకొన్న వివాదం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుంది. తాజాగా మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపణలకు నిరసనగా తిరుమలలో తితిదే ఉద్యోగులు గురువారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. శ్రీవారి ఆలయంతో సహా అన్ని విభాగాలల్లోని ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. మూడురోజుల పాటు ఇదే విధంగా తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్లు ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు తీతీదే ఉద్యోగులు మాట్లాడుతూ రమక్ష దీక్షితులు పాలకవర్గంపై కక్షతో తిరుమల తిరుపతి దేవస్థానంలో నగలు మాయం అంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తద్వారా తితిదే ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ మాట్లాడని రమణ దీక్షితులు ఇప్పుడెందు ఆరోపణలు చేస్తున్నారో ప్రజలకు అర్థమైందన్నారు. కావాలనే ఇలా చేయడం ద్వారా తితిదే ప్రతిష్ట దెబ్బతింటుందని, ఇలాంటి వ్యాఖ్యలను మానుకోవాలని వారు రమణ దీక్షితులకు విజ్ఞప్తి చేశారు.
టీటీడీ ఉద్యోగుల వైఖరిని ఖండించిన నటి కవిత..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగుల వైఖరిని నటి, బీజేపీ మహిళా నేత కవిత ఖండించారు. శ్రీవారి ఆలయంలో టీటీడీ ఉద్యోగులు,అర్చకులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ సందర్భంగా కవిత గురువారం మాట్లాడుతూ.. ఇప్పటికే శ్రీవారి ఆలయ పరువు తీస్తున్నారని, నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టడం బాధ కలిగించిందన్నారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని ఆమె కోరారు. ఇలాంటి పరిస్థితుల వల్ల భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిజానిజాలను వెలుగులోకి తెచ్చి ప్రజలకు వివరించాలన్నారు.