నాలుగేళ్లలో ఏపీని అభివృద్ధిపథంలో నడిపాం
– 2019లో చంద్రబాబు గెలుపు చారిత్రక అవసరం
– ప్రతిపక్షాలు కావాలనే టీడీపీపై మూకుమ్మడి దాడి ప్రారంభించాయి
– మోదీ కాళ్లు పట్టుకొని జగన్ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు
– విలేకరుల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, మే22(జనం సాక్షి ) : ఏపీ కష్టకాలంలో ఉన్న సమయంలో టీడీపీ పాలనా పగ్గాలు చేపట్టిందని, విభజన కష్టాల నుంచి సీఎం రాష్ట్రాన్ని గట్టెక్కించారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ తెలుగు ప్రజల గొంతుకోస్తే… బీజేపీ వంచన చేసిందని విమర్శించారు. నాలుగేళ్లలో ఏపీని కొద్దికొద్దిగా అభివృద్ధి పర్చుకుంటూ ప్రస్తుతం ఓ స్థాయికి తీసుకొచ్చామన్నారు. ఎన్నికల సమయంలో ఏపీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొనే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టున్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం ఏపీకి ప్రత్యేక ¬దా ఇస్తుందని భావించామన్నారు. కానీ ప్రత్యేక ¬దా ఏ రాష్ట్రానికి ఇవ్వటం లేదు అని చెప్పడంతో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని తెలిపారు. అయినా కేంద్రం దానికి కూడా సహకరించకుండా ఏపీపై కక్షపూరితంగా వ్యవహరించిందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని గుర్తించి చంద్రబాబు కేంద్రం నుంచి వైదొలిగారని అన్నారు. ఒకవైపు ప్రత్యేక ¬దాకోసం తాము పోరాడుతుంటే జగన్ మోహన్‌రెడ్డి మోదీని ప్రశ్నించకుండా తమను ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. 2019లో చంద్రబాబు గెలుపు చారిత్రక అవసరమని మంత్రి పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు కావాలనే టీడీపీపై మూకుమ్మడి దాడి ప్రారంభించారని మంత్రి అన్నారు. నిన్నటి వరకు పాలన బాగుందని పవన్ కళ్యాణ్ నేడు తిట్టడం వెనుక ఆంతర్యమేమిటో ప్రజలకు అర్థమైందన్నారు. మరోవైపు జగన్ చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ కాళ్లు పట్టుకుని జగన్ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ రాజీనామా డ్రామాలాడుతోందని మండిపడ్డారు. జగన్, పవన్, బీజేపీలు టీడీపీని ఏమి చేయలేరని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో ఏపీలో జరిగిన అభివృద్ధి, ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి 2019లో విజయం సాధిస్తామని మంత్రి అన్నారు.
——————–