నిత్యం లాంచీల్లోనే లంకగ్రామాల ప్రయాణం
రోడ్డు సౌకర్యాలుంటే ప్రమాదాలు తప్పేవి
ఏటా ప్రమాదాలు ఉన్నా పట్టించుకోని పాలకులు
కాకినాడ,మే18(జనం సాక్షి ): పాపికొండల యాత్రంటే పరమేశ్వరుని సన్నిధికే అన్న రీతిగా ప్రమాదాలు జరుగుతన్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కృష్ణా పుష్కరాల్లో తిక్కిసలాట లాంటి గటనలు భయపెడుతున్న వేళ పర్యాటక రంగంలో నిర్లక్ష్యం కళ్లకు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. రహదారుల్లేక, ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించక జిల్లాలో 70 వరకు గ్రామాల ప్రజలు పడవ ప్రయాణాలపైనే ఆధారపడుతున్నారు. అనేక గ్రామాలకు రహదారులు లేక, త్వరగా వెళ్లేందుకు జలమార్గాలను వెతుక్కుంటున్నారు. జలమార్గాలను అభివృద్ది చేస్తామన్న సిఎం చంద్రబాబు నాలుగేళ్లుగా గోదావరిలో ఒక్క లాంచీ మార్గాన్ని అయినా పట్టించుకోలేదు. ఇకపోతే పడవ నిర్వాహకులు తమకెంత సొమ్ము వస్తుందని చూసుకుంటున్నారే తప్ప పరిమితిని పట్టించుకోవడం లేదు. ప్రయాణికుల రాకపోకలకు పడవలను అనుమతించకూడదు. లాంచీలు, పంటుల పైనే ప్రయాణాలు సాగించాలి. ఇప్పుడా లాంచీలు, పంటులే ప్రమాదాలకు గురై బలితీసుకుంటున్న నేపథ్యంలో పడవ ప్రయాణాలు దినదిన గండంగా మారాయి. ప్రమాదం జరిగాక హడావుడి చేయడం తప్ప నిబంధనలు, జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరిమితికి మించి ఎక్కిన ప్రయాణికులతో నడుస్తోంది. తాజాగా మంటూరు, వాడపల్లి మధ్య లాంచీ ప్రమాదానికి గురైన తీరు నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది. ఏదైనా ప్రమాదం జరి గితే ప్రయాణికులు జల సమాధి కావడం తప్ప మరో మార్గం లేదు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారుల కళ్లముందే పరిమితికి మించిన ప్రయాణికులతో పడవలు నడిచాయి. కానీ, ఏ ఒక్క అధికారీ పట్టించుకోలేదు. ప్రమాద స్థలాన్ని చేరుకునేందుకు కూడాఇలాంటి పడవలపైనే ప్రయాణాలు సాగుతున్నాయి. జనాల రద్దీ దృష్ట్యా అక్కడున్న లాంచీలను తిప్పాల్సిందిపోయి ప్రమాదకరమైన పడవ ప్రయాణానికి అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఏముందిలే ఈ ఒక్కరోజే కదా అన్నట్టుగా అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ఇక్కడ రోజూ జరుగుతున్న తంతు కూడా దాదాపు ఇదే. లాంచీ ప్రయాణాలతోపాటు పడవ ప్రయాణాలు సమాంతరంగా సాగుతున్నాయి. లాంచీలే ప్రమాదాలకు గురవుతుంటే పడవల భద్రత గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం మండలాల పరిధిలోకి వచ్చే సలాదివానిపాలెం, కమిని, గురజాపులంక, శౌరిలంక, కొత్తలంక, గోగుల్లంక గ్రామాలకు పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. 1992లో గోగుల్లంక, భైరవలంక మధ్య చింతేరు పాయలో పడవ బోల్తాపడి తొమ్మిది మంది మృతి చెందారు. ఆత్రేయపురం మండలం పేరవరం, వద్దిపర్రు, వెలిచేరు, వాడపల్లి గ్రామాల ప్రజలు లంక భూములకు వెళ్లేందుకు పడవ ప్రయాణమే సాగిస్తారు. 1990లో లంక రేవులో పడవ మునిగిపోయి పదిమంది చనిపోయారు. తాళ్లరేవు మండల పరిధిలో గోవలంక, పిల్లంక, అరటికాయ లంక శేరిలంక, కొత్తలంక, ప్రజలు పడవ ప్రయాణం చేయకతప్పడం లేదు. ఈ ప్రాంతంలోని గోదావరి నదీపాయపై 2004లో జరిగిన పడవ ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతి చెందారు. మామిడికుదురు మండలంలో కరవాక? ఓడలరేవు, గోగన్నమఠం? బెండమూర్లంక, పెదపట్నం లంక కె.ముంజవరం గ్రామాల మధ్య పడవ ప్రయాణాలు తప్పడం లేదు. రాజోలు, సఖినేటిపల్లి మండలాలకు చెందిన రైతులు లంక భూములకు వెళ్లేందుకు పడవలపైనే ఆధార పడుతున్నారు. కొత్తపేట మండలంలోని తొగరుపాయకు వెళ్లేం దుకు వరదలొచ్చినప్పుడు పడవపై ప్రయాణం సాగిస్తున్నారు. ఆలమూరు మండలంలో వరదలొచ్చి నప్పుడు చెముడులంక నుంచి బడుగువాని లంక గ్రామాలకు వెళ్లాలంటే ఇదే పరిస్థితి. సీతానగరం మండలం వంగలపూడి నుంచి గూటాల వరకు వెళ్లేందుకు పడవపైన ప్రయాణం సాగిస్తున్నారు. పురుషోత్తపట్నం నుంచి పోలవరం వెళ్లేందుకు లాంచీపై ప్రయాణికులు వెళ్తుంటారు. ఇలా అనేక గ్రామాలకు నాటు పడవలే ఆధారం. వాటి విూదే ప్రయాణం సాగిస్తున్నారు. నిత్యం ప్రమాదాల మధ్యే జీవనయానం సాగిస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. కానీ, ప్రమాదకర పరిస్థితులను నియంత్రించే దిశగా అధికారులు, పాలకులు అడుగు వేయడం లేదు. 70 గ్రామాల్లో చాలా వరకు రహదారులు వేస్తే పడవలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఏజెన్సీలోని గ్రామాలకు ప్రత్యామ్నాయ రహదారులు వేసినట్టయితే పడవలపై వెళ్లి రావల్సిన అవసరం ఉండదు. కానీ, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టడం లేదు. కనువిప్పు కలగడం లేదు.
——————–