పారిశుద్ధ్యం ప్రైవేటీకరణ తగదు
కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నాలు సరికాదు
విజయవాడ,మే25(జనంసాక్షి): పట్టణాల్లో పారిశుధ్య పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడం కార్మిక
వ్యతిరేక చర్యేనని సిఐటియూ ఆరోపించింది. దీంతో కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నం చేయవద్దన్నారు. ప్రైవేట్ సంస్థలకు వేలాది కోట్లు కట్టబెట్టే కుట్రలో భాగంగానే ఈ చర్య చేపట్టారని మండిపడ్డారు. ఈ ప్రయత్నాలను విరమించుకోవాలని నేతలు డిమాండ్ చేసారు. సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల్లోని పౌర సేవలను ప్రైవేటీకరించడానికి పూనుకుంటోందని విమర్శించారు. అందులో భాగంగానే 279 నంబరు జీవోను తీసుకొచ్చిందని తెలిపారు. పట్టణాల్లో చెత్త సేకరణను ప్యాకేజీల వారీగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని చూడడం ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడమేనని విమర్శించారు. పౌర సేవల నిర్వహణకు అవసరమైన కార్మికులను ఇంతవరకు ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతుల్లో నియమించు కునేదని, ఇప్పుడు పనులనే కాంట్రాక్టుకు ఇచ్చేయడానికి పూనుకుందని వివరించారు. ఇది అమలైతే కార్మికులు ఉద్యోగాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటోందన్నారు. ఇప్పుడు ఈ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే అవి ప్రజల అవసరాలను పట్టించుకోవని తెలిపారు. చెత్త పన్ను పేరిట ఇప్పటికే ప్రజల ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారన్నారు. ప్రైవేట్ సంస్థలకు పారిశుధ్య బాధ్యతలు అప్పగిస్తే నిర్వహణ వ్యయం భారమై, అందంతా ప్రజల విూదే పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుధ్య పనుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ, మరోవైపు ముఖ్యమంత్రి వాటర్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం మరింత ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి వైదొలుగుతూ క్రమంగా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని, పౌర సేవలన్నింటిలోను ప్రైవేట్ సంస్థలు, కార్పొరేషన్ల పెత్తనాన్ని పెంచుతోందని విమర్శించారు. గత పదిహేనేళ్లుగా ప్రజారోగ్య విభాగంలో ఖాళీగా ఉన్నపోస్టులను భర్తీ చేయకుండా ఇప్పుడు ఏకంగా పనులనే ప్రైవేట్‌పరం చేయడం దుర్మార్గమని విమర్శించారు. పౌరసేవల ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను తిప్పి కొట్టాలని స్థానిక సంస్థల పాలక మండళ్లను, ప్రతినిధులను రామకృష్ణ కోరారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరగుఉతన్నాయని వీటిని మరింత ఉధృతం చేస్తామన్నారు.