పెట్రోధరలతో నిత్యావసర సరుకులపై భారం
సామాన్యులకు తిప్పలు తప్పవన్న యనమల
భారం ప్రజలపై పడకుండా చూడాల్సింది కేంద్రమే
అమరావతి,మే22(జనం సాక్షి ): రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో మధ్య తరగతి ప్రజలపై ఎక్కువ భారం పడుతుందని ఎపి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. దీనిప్రభావం నిత్యావసరాలపై తీవ్రంగా ఉంటుందన్నారు. మంగళవారం ఆయన అమరావతిలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో మాట్లాడుతూ… ఇంటర్నేషనల్ మర్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా ధరలు పెంచడం దారుణమన్నారు. దీని వల్ల ప్రజలపై తీవ్రమైన భారం పడుతుందన్నారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల విూద ఎక్కువ భారం పడుతుందని తెలిపారు. అదే క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్ లో తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. పెట్రోల్ ధరలు తగ్గించమని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించడం సరైంది కాదన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ఆ భారం ప్రజలపై పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని యనమల స్పష్టం చేశారు. ఇకపోతే కర్ణాటకలో అప్రజాస్వామిక చర్యలకు బీజేపీనే బాధ్యత వహించాలని రామకృష్ణుడు అన్నారు. గాలి జనార్థన్ రెడ్డి బేరసారాల టేపులపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్, గాలి జనార్దన్ రెడ్డి బీజేపీకి ప్రధాన వ్యక్తులుగా మారారని ఆయన అన్నారు. కర్ణాటకలో బీజేపీ వ్యవహరించిన తీరు చూస్తుంటే… ఇటువంటి ప్రమాదం భవిష్యత్తులో ఎక్కువ ఉంటుందనే భావన కలుగుతుందని అన్నారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడానికి బీజేపీ పూనుకున్నట్లుగా కనిపిస్తుందని యనమల పేర్కొన్నారు. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవడమే బీజేపీ విధానంగా కనిపిస్తోందని, దక్షిణభారతంలో కూడా అడుగుపెట్టాలని చూస్తోందని, తప్పుడు విధానాలతో అయినా కర్ణాటకలో అడుగుపెడితే… మిగిలిన రాష్ట్రాల్లో కూడా పెత్తనం చెలాయించవచ్చునే భావనతో బీజేపీ ఉందని… అందుకు తగిన విధంగా కర్ణాటక ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పారని యనమల అన్నారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాల్సి అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.