ఫిక్సింగ్ త్రయంపై రిపోర్ట్ అందజేసిన సవానీ
– స్పాట్ ఫిక్సింగ్ పై విచారణ పూర్తి
–నేడు బీసీసీఐకి నివేదిక అందజేత
– కొత్త ట్రెజరర్‌గా రవి సావంత్
న్యూఢిల్లీ ,జూన్ 10 (జనంసాక్షి) :
ఐపీఎల్‌లో సంచలనం సృష్టించిన స్పాట్‌ఫిక్సింగ్ వ్యవహారంపై బీసిసిఐ యాంటీ కరప్షన్ యూనిట్ విచారణ పూర్తయింది. ఫిక్సింగ్‌లో దొరికిపోయిన ముగ్గురు రాజస్థాన్ క్రికెటర్లపై రవి సవానీ ఆధ్వర్యంలోని ఏకసభ్యకమిటీ విచారణ జరిపి దానికి సంబంధించిన నివేదికను బీసిసిఐకి అందజేసింది. ఢిల్లీలో జరిగిన వర్కింగ్ కమిటీ విూటింగ్‌లో బీసిసిఐ ఈ నివేదికను అందుకున్నప్పటకీ… దాని వివరాలు మాత్రం వెల్లడించలేదు. అసలు కనీసం నివేదిక కవర్‌ను కూడా తెరవలేదని సమాచారం. అయితే బోర్డ్ నియమించిన డిసిప్లినరీ కమిటీ ఈ రిపోర్ట్‌ను పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. ఈ కమిటీలో అరుణ్‌జైట్లీ , నిరంజన్‌షాతో పాటు శ్రీనివాసన్ కూడా సభ్యులుగా ఉన్నారు. శ్రీనివాసన్ అధ్యక్ష పదవికి తాత్కాలికంగా దూరంగా ఉన్న నేపథ్యంలో కమిటీ నుండి అతన్ని తప్పించింది. ఇదిలా ఉంటే స్పాట్‌ఫిక్సింగ్ కేసులో చిక్కుకున్న ముగ్గురు ఆటగాళ్ళు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలాలపై సవానీ రిపోర్ట్ సమర్పించడంతో బోర్డు నిర్ణయం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ముగ్గురిపై జీవితకాల నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది. బోర్డ్ వర్కింగ్ కమిటీ విూటింగ్‌లో సవానీ అందజేసిన నివేదకను చూడనప్పటకీ… ఐపీఎల్ ఆరోసీజన్ జరుగుతోన్న సమయంలో వీరు ఏ ఏ స్పాన్సర్డ్ ఈవెంట్లకు హాజరయ్యారనే విషయంపై కమిటీ వివరాలు కోరినట్టు తెలుస్తోంది.