బాబుది అధర్మ పోరాటసభ

అపవిత్రమైన స్థలాన్ని శుద్ది చేయబోతే అడ్డుకున్నారు
గంటాను విమర్శించడం శుద్ద వేస్ట్‌
విజయసాయిరెడ్డి ఆరోపణ
విశాఖపట్నం,మే23( జ‌నం సాక్షి):  వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని విశాఖ నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశాఖ నగరంలో మంగళవరాం జరిగిన టీడీపీ ధర్మపోరాట సభకు వేదికైన మైదానాన్ని శుద్ధి చేయాలన్న వ్యూహంతో విజయసారెడ్డి నేతృత్వంలో వైకాపా నేతలు ఈ ఉదయం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఏయూ గ్రౌండ్‌ వైపు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అదే సమయంలో విజయసాయిరెడ్డి 16వ నంబర్‌ జాతీయ రహదారిపై కృష్ణా కళాశాల వద్ద బైటాయించారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఆందోళన విరమించకపోవంతో సెక్షన్‌ 151 ప్రకారం ముందస్తుగా అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో వైకాపా కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆంధప్రదేశ్‌ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గోడ విూద పిల్లి లాంటి వారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వీ విజయసాయి రెడ్డి అన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే ఆయన అక్కడ చేరిపోతారని చెప్పారు. ఆయనకు డబ్బే ప్రధానమని, నీతి నియమాలు లేని గంటా కనీసం విమర్శించేందుకు కూడా అర్హుడు కారని అన్నారు. గతంలో ఎన్నో పార్టీలు మారిన గంటా ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి మారడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు విజసాయి వెల్లడించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నష్ట జాతకుడని, ఆయన అధర్మ పోరాటం చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయాలన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. దాన్ని గంగాజలంతో శుద్ధి చేసే కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకున్నారని, రాష్ట్రంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆరోపించారు. గతంలో విశాఖ సీపీ యోగానంద్‌ ఎయిర్‌పోర్టు రన్‌పైనే వైఎస్‌ జగన్‌ను అడ్డుకున్న ఘటనపై పార్లమెంటు సభా హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అలాంటి యోగానంద్‌ కులపిచ్చితో పోలీసులను తెలుగుదేశం కార్యకర్తల్లా వాడుకుంటున్నారని అన్నారు.
విశాఖపట్టణంలో మంగళవారం జరిగిన ధర్మపోరాట సభ అధర్మ సభ, అన్యాయమైన సభ అని వ్యాఖ్యానించారు. స్వలాభం, స్వార్ధం, ప్రచారం కోసం అధికార దుర్వినియోగానికి ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. రాజకీయ సభలను విశ్వవిద్యాలయంలో నిర్వహించరాదన్న జీవో ఉన్నప్పటికీ అనుమతి ఇచ్చి వీసీ, రిజిస్టార్ర్‌ నిబంధనలను ఉల్లంఘించారని అన్నారు. చంద్రబాబు ఓ దొంగ అని, ప్రజలను మభ్యపెట్టి డ్రామాలాడే వ్యక్తి అని అందరికీ తెలుసని అన్నారు. ప్రతిపక్షాన్ని అణగదొక్కి, పార్టీ విూద, కార్యకర్తల విూద, సానుభూతిపరులైన సోషల్‌విూడియాలో పని చేసే వ్యక్తులపైనా దొంగ కేసులు పెట్టడం వంటి ప్రజావ్యతిరేక చర్యలతో రాబోయే ఎన్నికల్లో అధికారం సిద్ధించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
——