బ్రాహ్మణులపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు

– రమణ దీక్షితులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
– ఈనెల 21న నిరసనలు చేపడతాం
– బ్రాహ్మణ ఐక్య సంఘం వేదిక సభ్యులు
విజయవాడ, మే19( జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం వంటి అంశాలను వదిలి బ్రాహ్మణులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని.. అందులో భాగంగానే రమణ దీక్షితులుకు నోటీసులు జారీ చేశారని విజయవాడ బ్రాహ్మణ ఐక్య సంఘం వేదిక ఆరోపించింది. టీటీడీ రమణ దీక్షితులను వెంటనే  విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ, బ్రాహ్మణులపై దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 21 తేదీన అన్ని పీఠాధిపతులు, బ్రాహ్మణ సంఘాలు,  బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని ప్రకటించింది. ఈ సందర్భంగా శనివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బ్రాహ్మణులపై టీడీపీ ప్రభుత్వం కక్ష్య సాదింపు చర్యలుకు పాల్పడుతుందని, దానిలో భాగంగానే అనాదిగా వంశపారంపర్యంగా వస్తున్న రమణ దీక్షితులను పదవి నుంచి తొలగించారని ఆరోపించింది. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం వంటి అంశాలను వదిలి బ్రాహ్మణులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని…ఇలా చేస్తే చంద్రబాబు వెంకటేశ్వర స్వావిూ ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించింది. ప్రభుత్వం బ్రాహ్మణులపై చేస్తున్న దాడులను హిందు సాంప్రదాయం విూద జరుగుతున్న దాడిగా భావిస్తున్నామని తెలిపింది. దేవాలయాల్లో అనాదిగా కైంకర్యం చేస్తున్న బ్రాహ్మణలను రాజకీయలతో రోడ్డుకీడ్చారు. అవినీతిని ప్రశ్నిస్తే విదులనుంచి తొలగిస్తారా అని ప్రశ్నించింది. రైతుల భూములనే కాక దేవాలయ భూములైన సదవర్తి భూములతో పాటు టీటీడీ ఆస్తులను కూడా కబ్జా చేస్తున్నారని ఆరోపించింది. ఆగమ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులకు వంశపారంపర్యంగా కైకర్యం చేసే హక్కు ఉందని తెలిపింది. బ్రాహ్మణుల మధ్య చీలికలు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని,  బ్రహ్మణలపై దాడులకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేస్తామని విజయవాడ బ్రాహ్మణ సంఘం ఐక్య వేదిక ప్రకటించింది.