భవిష్యత్ మహిళా పారిశ్రామికవేత్తలదే
– రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం
– ఐటీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్,నవంబర్ 30,(జనంసాక్షి): రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ముగింపు సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా మాట్లాడారు. జీఈఎస్ విజయవంతం కావడంలో నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించిందని మంత్రి కొనియాడారు. జీఈ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీకి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.సదస్సులో మూడు రోజుల పాటు 53 డిస్కసన్లలో 200 మంది స్పీకర్లు మాట్లాడినట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణలో మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య మరింత పెరగాలని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు వల్ల భారత్ – అమెరికా మైత్రి మరింత బలపడుతుందన్నారు. టీ హబ్‌ను ప్రధాని మోదీ, ఇవాంక ట్రంప్ ప్రశంసించారని మంత్రి తెలిపారు.ఈ సదస్సు ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నామని మంత్రి చెప్పారు. టీ హబ్ ద్వారా 4 రాష్ట్రాలకు మార్గదర్శనం చేస్తున్నాట్టు మంత్రి వివరించారు. ప్రొక్యూర్‌మెంట్ విధానంలో మహిళలు నిర్వహించే ఎస్‌ఎంఈలకు అవకాశం ఇస్తామని మంత్రి హావిూ ఇచ్చారు. ఎంట్రీప్రెన్యూర్లకు రాష్ట్ర ప్రభుత్వం టీ ఫండ్‌తో చేయూతనందిస్తున్నదని మంత్రి చెప్పారు. ఎంట్రీప్రెన్యూర్లను జీఈ సదస్సు ఓ మంచి వేదికలా నిలిచిందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచస్థాయి కార్యక్రమాలు నిర్వహించే సత్తా హైదరాబాద్‌కు ఉందని జీఈఎస్ ద్వారా కూడా నిరూపితమైందని మంత్రి తెలిపారు. జీఈఎస్ సదస్సులో కొత్త, వినూత్న ఆలోచనలు వెలుగు చూశాయని… జీఈఎస్ మహిళా వ్యాపారవేత్తలకు సంపూర్ణ భరోసా కల్పించిందని మంత్రి చెప్పారు. జీఈఎస్ ముగింపు వేడుకల్లో మంత్రి కేటీఆర్ తో పాటు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, రాష్ట్ర ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్, తదితరులు పాల్గొన్నారు. జీఈఎస్ స్టార్టప్ కంపెనీ పోటీలో విజేతగా ఫ్రాంటియర్ మార్కెట్ అంకుర సంస్థ నిలవగా.. కంపెనీ సీఈవో అజైతా షాకు 4 లక్షల అమెరికా డాలర్లను యూఎస్ కు చెందిన జీఈఎస్ ప్రతినిధులు అందజేశారు.
మహిళా వ్యాపారవేత్తల కోసం వీహబ్
మహిళా వ్యాపారవేత్తల కోసం మంత్రి కేటీఆర్ 3 నిర్ణయాలను ప్రకటించారు. మహిళా వ్యాపారవేత్తల కోసం ప్రత్యేకంగా వీ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వీహబ్ అంటే.. ‘వుమెన్ ఎంపవర్ హబ్’ అని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలకు సహాయం కోసం రూ. 15 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హావిూ ఇచ్చారు. ప్రభుత్వం కోనుగోలు చేసే వస్తువుల విషయంలో మహిళా వ్యాపారవేత్తలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. కొన్ని ప్రభుత్వ కొనుగోళ్లలో నాలుగో వంతు మహిళా పారిశ్రామికవేత్తల నుంచి కొంటామని మంత్రి హావిూ ఇచ్చారు. నీతి ఆయోగ్ ఆ నాలుగు మెట్రో నగరాల వైపే కాకుండా హైదరాబాద్ వైపు కూడా చూడాలని మంత్రి చమత్కరించారు. సదస్సు విజయవంతంతో హైదరాబాద్ సత్తా ప్రపంచానికి తెలిసిందని… తెలంగాణ ఏర్పాటు చేసే వీహబ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.