మరింత ఉధృతంగా ఆర్టీసీ సమ్మె
– 18రోజూ తగ్గని సమ్మె వేడి
– వంటావార్పులతో ఉద్యమం కొనసాగింపు
– పొట్ట కొట్టొందంటూ తాత్కాలికి సిబ్బందికి వినతి
– గ్రామాల్లో డిపోల ముందు నిరసనలు,ర్యాలీలు
హైదరాబాద్,అక్టోబర్ 22(జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆందోళన మరింత ఉధృత రూపం దాల్చింది. డిమాండ్ల పరిష్కారం కోసం 18 వరోజూ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. జిల్లాల్లో ఆందోళనలు సాగుతున్నాయి. ఎక్కడిక్కడే నిరసనలుచేస్తున్నారు. వంటావార్పుతో ఉద్యమాన్ని వేడెక్కిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీజీ జెఎసి నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజారెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్, చాడ వెంకట్ రెడ్డి, ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా అఖిల పక్షం వంటా వార్పునకు పిలుపు నిచ్చింది. సికింద్రాబాద్‌లోని జేబీఎస్ వద్ద ఆర్టీసీ జేఏసీ, రాజకీయ జేఏసీ నేతలు, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకోవైపు ఆర్టీసీ సమ్మె విద్యార్థులు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. బస్సుల కొరత కారణంగా వారు నానా పాట్లు పడుతున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికుల ఆందోళన మరింత ఉధృతమైంది. ఆర్టీసీ సమ్మెతో విద్యార్థులు, ఉద్యోగులపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కొరత కారణంగా వారు నానా పాట్లు పడుతున్నారు. కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లేందుకు ఆటోలను, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరింది. ప్రభుత్వం మెట్టు దిగి రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు 21వ తేదీ నుంచి పది రోజుల వరకు కార్యాచరణ ప్రకటించారు. వివిధ రూపాల్లో నిరసన తెలిపేలా షెడ్యూల్ విడుదల చేశారు. అందులోభాగంగా మంగళవారం నాడు తమ పొట్ట కొట్టొద్దంటూ తాత్కాలిక సిబ్బందికి వినతి పత్రాలు, పూలు ఇచ్చి నిరసన తెలిపారు. మరోవైపు సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షనేతలు పాల్గొన్నారు.
వినతి పత్రాలు, పూలతో నిరసన
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతోంది. చర్చల్లేవు అంటూ ప్రభుత్వం మొండికేయడంతో కార్మికులు నిరసనకు దిగుతున్నారు. ఆ క్రమంలో కొన్ని చోట్ల ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. సమ్మెలో భాగంగా ఆందోళనలు చేపడుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదాలు జరిగి తోపులాటకు దారి తీస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. సమ్మెలో భాగంగా కార్మికులు వేకువజామునే కరీంనగర్ బస్ స్టేషన్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. పార్కింగ్ స్థలంలో ఉన్న ఆర్టీసీ అద్దె బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడంతో అద్దం ద్వంసమయింది. సమ్మెకు సహకరించాలని బస్సులు నడిపే తాత్కాలిక డ్రైవర్‌లను కార్మికులు కోరారు. బస్ స్టేషన్‌లో ఉన్న బస్సును డిపోలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు బస్సులు బయటికి వెళ్లకుండా నిలిచిపోయాయి. బస్సులను అడ్డుకున్న జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీతాలు లేక న్యాయమైన డిమాండ్ కోసం కార్మికులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని నేతలు విమర్శించారు. ఇకపోతే కరీంనగర్ నుంచి వేములవాడ వెళ్తున్న బస్సు.. డీజిల్ లేక మధ్యలో ఆగిపోయింది. దీంతో అధికారుల నిర్లక్ష్యం పట్ల ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చేసేదేవిూలేక మధ్యలోనే ప్రయాణికులు దిగిపోయారు.