మహమ్మాదాబాద్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్.పి కె నరసింహ

గండీడ్ ఆగస్టు 16 (జనం సాక్షి)

మహబూబ్ నగర్ జిల్లా మహమ్మాదాబాద్ పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీ ల్లో భాగంగా బుధవారం జిల్లా ఎస్పీ కే నరసింహ ఆకస్మిక తనిఖీ చేశారు .
పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరికి కరచలనం చేసి పరిచయం చేసుకున్నారు . అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ ఎస్పీ కి వివరించారు.
అనంతరం ఎస్పీ పోలీస్ స్టేషన్ లోని రిజిస్టర్లను , సి డి ఫైల్లను పరిశీలించి స్టేషన్ అధికారులకు పలు సూచనలు చేశారు . ప్రతిరోజు పోలీస్ స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్ స్టేషన్ లోని వర్టికల్స్ నిర్వహణ, హెచ్ ఆర్ ఎం ఎస్ ఆన్ లైన్ వినియోగించు విధానాన్ని , టీఎస్ సి ఓ పి ఎస్ ఆన్లైన్లో కేసుల వివరాలు నమోదు చేయడం తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి పిటిషన్ ను ఆన్లైన్లో నమోదు చేయాలని, సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని , డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను ఆదుకొని న్యాయం చేయాలని అన్నారు . పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు వారిని తనిఖీ చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని , బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్లో ఉంచరాదన్నారు . అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ గురించి వివరించి వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించెల చూడాలన్నారు . రాత్రి సమయంలో గస్తీని పెంచాలని , అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు .
ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి మహేష్ , సి.డి.ఆర్.బి డిఎస్పి వెంకటరమణ రెడ్డి , ఎస్పీ సీసీ రాంరెడ్డి, రూరల్ ఇన్స్పెక్టర్ స్వామి , ఎస్ ఐ సురేష్ , ఐటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు .