మహారణ్యంగా గ్రీన్‌ ఛాలెంజ్‌

– మొక్కలు నాటిన బిత్తిరి సత్తి

– అనంతరం కేసీఆర్‌ మనవడు హిమాన్షు రావుకు, హాస్య నటులు బ్రహ్మానందం, ప్రియదర్శిని,బిగ్‌బాస్‌ ఫేమ్‌ శివ జ్యోతిలకు మొక్కలు నాటాలని పిలుపు

-దేశవ్యాప్తంగా ఛాలెంజ్న స్వీకరించిన పలువురు ప్రముఖులు

హైదరాబాద్‌,నవంబర్‌ 22(జనంసాక్షి):టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణ, ఆంధ్రాలో సెలబ్రిటీల గ్రీన్‌ ఛాలెంజ్‌ సందడి కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ విసిరిన ఛాలెంజ్‌ రోజు రోజుకూ విస్తరిస్తోంది. సినీ స్టార్లు మొక్కలు నాటుతూ తమ సహచర నటులను హరిత సవాల్‌ విసురుతున్నారు. ఇప్పటికే అక్కినేని అఖిల్‌, కవిత, వరుణ్‌ తేజ్‌, సాయిపల్లవి, పీవీ సింధు, యాంకర్‌ సుమ, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌, సూపర్‌ స్టార్‌ కృష్ణ.. తమ వంతుగా మొక్కలు నాటారు. ఇక తాజాగా బిత్తిరి సత్తి గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లో మొక్కలు నాటారు. ఆ ఫొటోలు సోషల్‌ విూడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.రోజు రోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు బిత్తిరి సత్తి. అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. రాజ్యసభ సభ్యులు సంతోష్‌ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు. ఇక తనలాగే మొక్కలు నాటాల్సిందిగా హాస్య నటుడు బ్రహ్మానందం, కేసీఆర్‌ మనవడు కల్వకుంట్ల హిమాన్షు రావు, కమెడియన్‌ ప్రియదర్శిని, బిగ్‌బాస్‌ ఫేమ్‌ శివ జ్యోతికి గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరారు.గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో ఎన్సీపీ ఎంపీ వందనా చవాన్‌ మొక్కలు నాటారు. గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం మొదలు పెట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ఆమె అభినందనలు తెలిపారు. భవిష్యత్‌ తరాలకు మంచి వాతావరణాన్ని అందించేందుకు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రతి ఒక్కరూ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగస్వాములు కావాలి అని ఆమె పిలుపునిచ్చారు.గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ కేశవరావు విసిరిన సవాల్‌ను రాజ్యసభ సభ్యులు తిరుచ్చి శివ, ఎంఏ ఖాన్‌లు స్వీకరించారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మూడు మొక్కలు నాటారు. గ్రీన్‌ ఛాలెంజ్‌ చక్కని కార్యక్రమం అని తిరుచ్చి శివ కొనియాడారు. పర్యావరణ పరిరక్షణకు గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. లక్ష మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేస్తానని తిరుచ్చి శివ తెలిపారు.ఎంఏ ఖాన్‌ మాట్లాడుతూ.. కాలుష్య రహిత దేశంగా మార్చాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాను. రానున్న రోజుల్లో ప్రతి ఎంపీ మూడు మొక్కలు నాటాలని పిలుపునిస్తున్నానని ఎంఏ ఖాన్‌ పేర్కొన్నారు.కాగా, తెలంగాణలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని రాజ్యసభ ఎంపీ సంతోష్‌ కుమార్‌ మొదట ప్రారంభించారు. అంతేకాదు మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెప్టెంబరు 5న వనమిత్ర అవార్డ్‌ను ఆవిష్కరించారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన వారందరికీ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఇగ్నైటింగ్‌ మైండ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్‌ ఏపీజె అబ్దుల్‌ కలాం వనమిత్ర బ్యాడ్జ్‌ ఆఫ్‌ హానర్‌ అవార్డుల ప్రధానం కార్యక్రమం జరగనుంది.

తాజావార్తలు