మున్సిపల్ ఎన్నికలకు లైన్‌క్లియర్!
– ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు
– అన్ని పిటీషన్‌లను కొట్టివేసిన హైకోర్టు
హైదరాబాద్,అక్టోబర్ 22(జనంసాక్షి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదంటూ దాఖలైన అన్ని పిటీషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. మున్సిపల్ ఎన్నికలపై గత మూడు నెలల నుంచి హైకోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తుది తీర్పును ప్రకటిస్తామని గతంలోనే హైకోర్టు చెప్పింది. మున్సిపల్ ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు మంగళవారం తుది తీర్పును వెలువరించింది. మున్సిపల్ ఎన్నికలను 119 రోజుల్లో నిర్వహించాలని జూన్ 25న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల పక్రియను తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి న్యాయస్థానం సూచించింది. వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు మొదలైన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదంటూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించడంతో.. న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. తెలంగాణలో మొత్తం 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం ఇంకా పూర్తి కాలేదు. ఈ క్రమంలో 10 నగరపాలికలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు 128 మున్సిపాలిటీల్లో సిద్దిపేట, అచ్చంపేట పురపాలక స్థానాలు పదవీ కాలం పూర్తి కాలేదు. అంతేకాకుండా కొన్ని సమస్యల వల్ల మరో ఐదు పురపాలక స్థానాల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడలేదు. దీంతో త్వరలో రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.