రికార్డుల్లో లేని వజ్రాన్ని తీసుకురమ్మంటే ఎలా..?: ఇవో

విజయవాడ,మే22(జ‌నం సాక్షి ): తిరుమల ఆలయ రికార్డుల్లో లేని వజ్రాన్ని తీసుకురమ్మంటే ఎలా..? అని టీటీడీ వో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ప్రశ్నించారు. విలువైన వజ్రం మాయమయ్యిందని, అది అంతర్జాతీయ మార్కెట్లో వేలం వేశారని రమణదీక్షితులు ఆరోపించారు. దీనిపై ఇవో స్పందించారు. ఏ నగా పోలేదని అన్నారు. అయితే లేని వజ్రాన్ని తీసుకుని రాగలమా అని ప్రశ్నించారు. టీటీడీ వివాదంపై మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ అన్ని విషయాలు ముఖ్యమంత్రికి వెల్లడించినట్లు చెప్పారు. అలాగే సీఎం కూడా తిరుమల పవిత్రతకు భంగం కలగకూడదని చెబుతూ పలు సూచనలు చేశారని అన్నారు. 1952 నుంచి శ్రీవారి ఆభరణాల రికార్డులు ఉన్నాయని సింఘాల్‌ తెలిపారు. శ్రీవారి ఆభరణాలు భద్రంగా ఉన్నాయని రిటైర్డ్‌ జడ్జిల కమిటీ తేల్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. శ్రీకృష్ణ దేవరాయల ఆభరణాలు ఏవో ఆ కమిటీ తేల్చలేకపోయిందని సింఘాల్‌ అన్నారు. ప్రతి ఏడాది ఆభరణాల తనిఖీ జరుగుతుందని, ఒక్క మిల్లీ గ్రాము 
అటూ ఇటైనా రికార్డుల్లోకి వస్తుందని ఈవో వెల్లడించారు. శ్రీవారి ఆభరణాల జాబితా ఇప్పటికే ఇచ్చామని ఆయన అన్నారు. ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే ఆభరణాలను ప్రదర్శిస్తామని సింఘాల్‌ స్పష్టం చేశారు.