రేషన్ షాపుల భవిష్యత్ అగమ్య గోచరం
ఉపాధి కోసం ఆందోళనలో డీలర్లు
విజయవాడ,మే19(జనం సాక్షి): రేషన్ దుకాణాల్లో సరుకులు ఒక్కొక్కటే రద్దు కావడం లేదా తగ్గించడంతో ఇప్పడు డీలర్లు ఆందోళన చెందుతున్నారు. తమ ఉపాధికి ప్రభుత్వం గండి కొడుతోందని అంటున్నారు. ఇక తమకు బతుకుదెరువు ఎలా అని అంటున్నారు. తమను ఉద్యోగులుగా గుర్తించి జీతాలు ఇచ్చి ఆదుకోవాలని
కోరుతున్నారు. బియ్యం, కిరోసిన్, చక్కరెలు తగ్గించారు. పేదలకు తక్కువ ధరలో నిత్యావసరాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్ షాపుల మూత తప్పదన్న భావన నెలకొంది. సరకుల కేటాయింపు, వాటి నాణ్యతల విషయంలో అధికార యంత్రాంగంలో లోపిస్తున్న చిత్తశుద్ధి కారణంగా ఇప్పటికే ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చేలా చేస్తోంది. బియ్యం, కిరోసిన్, చింతపండు, వంటి వస్తువులను చౌకధరల దుకాణాల ద్వారా పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు అందజేయడం కోసం ప్రభుత్వం రూ.కోట్ల భారాన్ని రాయితీ రూపంలో భరిస్తోంది. ఇప్పుడు కొన్ని సరుకులు ఇందులో నుంచిమాయం కానున్నాయి. కిరోసిన్, చక్కెర మాయమయితే ఇక తమకు వచ్చే కమిషపన్ తగ్గి బతుకుదెరువు పోతుందని డీలర్లు వాపోతున్నారు. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం నిర్దేశిరచిన సరుకులను లబ్దిదారులకు సరఫరా చేస్తుంటారు. నిత్యావసరాల విషయంలో ప్రభుత్వాలు ఇష్టానుసారం వ్యవహరిస్తుండటంతో వాటి అవసరం కూడా తగ్గిపోనుంది. సంక్షేమం పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు దుర్వినియోగం కావడం మినహా పేదలకు ఉపయోగపడటం లేదు. సరకుల నాణ్యత, తూకాల విషయాన్ని పక్కన పెట్టినా.. అసలు ఏ సరకులు సరఫరా చేస్తారో అన్న విషయం ఆఖరు నిమిషం వరకూ ఏ సరుకు ఉంటుందో పోతుందో డీలర్లకు కూడా తెలియడం లేదు. గతంలో ఇచ్చిన కందిపప్పు, పామాయిల్, చింతపండు వంటివి ఏనాడో జాబితా నుంచి తొలగిపోయాయి. గడచిన రెండు మూడు సంవత్సరాలుగా కేవలం బియ్యం, పంచదార, కిరోసిన్‌లతోనే కార్డుదారులు సరిపుచ్చు కుంటున్నారు. మధ్యలో గోధుమపిండి, మినపప్పు వంటివి కేటాయిస్తున్నా ఆ విషయం కార్డుదారులకు తెలియడం లేదు. ఫలితంగా అవి బ్లాక్ మార్కెట్ కు వెళ్లడమో.., లేకుంటే ఆ నష్టం డీలర్ల నెత్తిన పడటమో జరుగుతోంది. కిరోసిన్ కోటా కూడా దుకాణాలకు చేరలేదు. మొత్తంగా ఇప్పుడు ఇక జరిగేది సరుకుల తొలగింపు తప్ప మరోటి కాదని డీలర్లు మండిపడుతున్నారు.