రైతాంగ సమస్యలను విస్మరించడమే కారణమా?
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ..ఆ తరవాతా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్‌కు కంచుకోట గా ఉన్న కరీంనగర్‌తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో అనూహ్యంగా అపజయం ఎదురు కావడం టిఆర్‌ఎస్‌కు జీర్ణించుకోలేని విషయం. అలాగే బిజెపి అంచనాలను పసిగట్టడంలో జిల్లాల నాయకత్వాలు విఫలమయ్యాయనే చెప్పాలి. అలాగే క్షేత్రస్థాయి సమస్యలను ఆకళింపు చేసుకుని అధినేత కెసిఆర్‌తో చర్చించి పరిస్కరించడంలో కూడా టిఆర్‌ఎస్ నేతలు విఫలం అయ్యారనే చెప్పాలి. మొత్తం 175 మంది రైతులు పోటీకి దిగడం ద్వారా దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్‌లో భాజపా అభ్యర్థి.. సిట్టింగ్ ఎంపీ కవితను ఓడించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.నిజామాద్ ఫలితమే తీసుకుంటే ఐదేళ్లు ఎంపిగా ఉన్న కవిత పసపుబోర్డు, ఎర్రజొన్న రైతుల సమస్యలపై బాగానే కష్టపడ్డారు. అయితే అది సమస్య పరిష్కారానికి పనికిరాలేదు. తక్షణంగా వారి పంటలను కొనుగోలు చేసేందుకు అవసరమైన ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసివుంటే బాగుండేది. రైతులతో నిరంతరం సంప్రదిం పులు చేస్తే పరిస్థితి మిక్కుటానికి వచ్చేది కాదు. వారు పోరాటాలకు దిగితే అణచివేతకు ప్రాధాన్యం ఇచ్చారే తప్ప ఆదుకునే ప్రయత్నం చేయలేదు. అలాగే నిజాంషుగర్స్ ఫ్యాక్టరీ తదితర అంశాలు కూడా తోడయ్యాయి. ప్రధానంగా రైతాంగ సమస్యలపై కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా రైతుల ఆవేదన ఉంది. ఎక్కడి రైతులైనా తాము పండించిన పంటల కొనుగోళ్లు జరగాలని భావిస్తారు. అది జరిగితే ఆనందిస్తారు. నిజామాబాద్‌లో అది జరగపోగా రైతుల ఆందోళనలను పోలీసు బలగాలతో అణచివేసే ప్రయత్నాలు కఠినంగా సాగాయి. ఈ విపరీత పరిణామాలు అమితంగా ప్రేమించే టిఆర్‌ఎస్‌ను కూడా కాదనుకోవడానికి కారణంగా చూడాలి. తెలంగాణ వస్తే ఇవన్నీ పరిష్కారం అవుతాయని అంతా భావించారు. నిజామాబాద్‌తో ముడిపడి ఉన్న రైతాంగ సమస్యలు ఆదిలాబాద్,కరీంనగర్‌లలో కూడా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు రైతాంగానికి ఖాతాల్లో డబ్బులు వేసే బదులు వారి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి, దానికి సరిపడా డబ్బులను ఖాతాల్లో వేస్తేనే ఆనందిస్తారు. ఒకరకంగా వినోద్‌కుమార్, కవిత,నగేశ్‌లను ఓడించడం ద్వారా ఉత్తర తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు రైతాంగ సమస్యలపై పరోక్ష సంకేతాలిచ్చినట్లుగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టుకోల్పోయి, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి గెలవడంతోనే ప్రజళ్లో ఉన్న అసంతృప్తి గుర్తించి టిఆర్‌ఎస్ మేల్కోలేదు. మాటలతో ప్రజలను మాట్లాడకుండా చేయడం.. వారి సమస్యలను దగ్గరగా విని ఆలోచన చేయకపోవడం వల్లనే ఓటమి ఎదురయ్యిందని ఇప్పటికైనా గులాబీ బాస్ గుర్తించాలి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో ఓటమి బిజెపికి కలసి వచ్చే అంశంగా చూడాలి. నిజానికి ఆదిలాబాద్‌లో బిజెపికి పెద్దగా బలం లేదు. కానీ టిఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఉందన్న విషయం బయటపడింది. రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా భావించే ఉత్తర తెలంగాణలో బిజెపి విజయంతో కొత్త సవిూకరణాలకు తెరతీయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విజయంతో బిజెపి పునాదులు వేసుకునే పనిలో ఉంటుందనడం లో సందేహం లేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో టీఆర్‌ఎస్ ప్రాభవానికి చెక్ పెట్టడం ఒక ఎత్తయితే కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ నడపాలన్న ఆశలకు గండిపడింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు గుండెకాయగా భావించే కరీంనగర్.. రాష్ట్ర రాజకీయ సవిూకరణాలను మార్చడంలో ఎప్పుడూ క్రియాశీలకంగా ఉంటూ వస్తోంది. తెలంగాణ ఉద్యమానికి కెసిఆర్ శ్రీకారం చుట్టి, ఇక్కడి సభతో ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పి తెలంగాణ సాధించారు. అలాంటి కరీంనగర్ జిల్లాతోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్‌లో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించడం ద్వారా బిజెపికి ప్రాణపత్రిష్ట చేశారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం బిజెపి పాగా వేసుకునే అవకాశం ఇచ్చినట్లు అయ్యింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ కరీంనగర్ నియోజకవర్గంలోనే శ్రీకారంచుట్టి.. ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు తనకు కుడిభుజంగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు పాటుపడుతున్న వినోద్‌కుమార్‌ను దేశం అబ్బురపడేవిధంగా మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించండి.. ఆయన కేంద్రంలో మంత్రి పదవిని చేపడతారని చేసిన విన్నపాన్ని ఆయన సెంటిమెంట్ జిల్లా తిరస్కరించింది. అంతేగాకుండా తన ప్రచారంలో అయోధ్య, హిందుత్వపై కెసిఆర్ నోరుజారిన తీరు కూడా ప్రజలను ఆలోచించేలా చేసిందనే చెప్పాలి. అలాగే ఇక్కడ కెసిఆర్‌కు అధికారం కట్టబెట్టాం కనుక కేంద్రంలో బలం ఉన్నా లేకున్నా ఒక్కటే అని కూడా భావించి ఉంటారు. ఎమ్మెల్యేలంతా తమవారే ఉన్నా తమ ఎంపీలను గెలిపించుకోలేని పరిస్థితి ఈ నియోజకవర్గాల్లో ఏర్పడటం గమనార్హం. ఇందుకు.. టీఆర్‌ఎస్ పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకత ఒక కారణమైతే.. కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం, ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ కనిపించడంతో ఓటర్ల ఆలోచనాసరళి మారిందా అన్నది చూడాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఘనవిజయం సాధించిన తర్వాత.. అదే ధీమాతో లోకసభ స్థానాలనూ సునాయసంగా గెలుస్తామనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతోపాటు.. ద్వితీయశ్రేణి నేతలు పెద్దగా పట్టించుకోకపోవడం కూడా ఆ పార్టీకి నష్టం కలిగించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం ఏడు నియోజకవర్గాల్లో మూడింటిని భాజపా గెలుచుకుంది. కోల్పోయిన మూడూ తెరాసకు సిట్టింగ్ స్థానాలే. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గాల్లో ఫలితాలు తెరాసకు కలిసి వస్తున్నాయి. మొన్నటి శాసనసభ ఎన్నికల్లోనూ ఓటర్లు కారుకే పట్టంగట్టారు. అనంతరం కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల్లో ఓటర్లు భిన్నమైన తీర్పు ఇచ్చారు. స్థానిక పరిస్థితులు, భాజపా ప్రచారం ఓటర్లను ఆకర్షించినట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు చాటు తున్నాయి. ఇదొక అవకాశంగా భావించి రైతాంగ సమస్యలను వారికోణంలో పరిష్కరించే ప్రయత్నం చేస్తే మళ్లీ విజయానికి బాటలు పడతాయనడంలో సందేహం లేదు.