రోడ్ సేఫ్టీ , అభయ యాప్ పై అవగాహన కల్పించిన బెల్లంపల్లి ఏసిపి

 

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి ఆర్కే సి ఓ ఏ క్లబ్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో బెల్లంపల్లి ఏసిపి పంతాటి సదయ్య ఆటో ఓనర్లకు,డ్రైవర్లకు, రోడ్ సేఫ్టీ, అభయ యాప్ ల పై శుక్రవారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందమంది ఆటో డ్రైవర్లు ఉన్నట్లయితే అందులో 99 మంది మంచి ఆటో డ్రైవర్ ఉన్నారని పేర్కొన్నారు. దాదాపు ఆటో ఓనర్స్, డ్రైవర్స్ 50% సింగరేణి కార్మికుల పిల్లలే ఉన్నారని, కార్మికులు పడ్డ కష్టాలు వారికి తెలుసని, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి, ఇక్కడి వాతావరణం అలవాటు పడ్డ డ్రైవర్లు ఉన్నారని అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ ,కరీంనగర్ వరంగల్ పట్టణాలను తీసుకున్నట్లయితే ఎక్కడి నుండో వచ్చి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఆటోడ్రైవర్లుగా చాలామంది జీవనాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడి ఆటో ఓనర్లు,డ్రైవర్లు సింగరేణి ఉద్యోగాలు రాకపోవడం వల్ల వారు ఆటో డ్రైవర్ వృత్తిని ఎన్నుకున్నారని, ఆటో డ్రైవర్లు తప్పు చేస్తారని నేను అనుకోవడం లేదని, అమ్మాయిలపై ఆటో డ్రైవర్లు, ఓనర్లు ఎలాంటి నేరాల్లో పాలుపంచుకోలేదని ఆయన అన్నారు. ఒక్క పర్సెంట్ మాత్రం ఆటో ఓనర్ల వద్ద మేము డ్రైవర్ గా పని చేస్తామని, ఆటో రెంట్ తీసుకొని ఉన్నవాళ్లే నేరాలకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సత్ప్రవర్తనతో ఆటో నడిపి ప్రయాణికుల భద్రతతో పాటు, కుటుంబ భద్రత చాలా ముఖ్యమని, కుటుంబ సభ్యులకు ఎలాంటి టెన్షన్ పెట్టకుండా జీవితాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ బి అశోక్, ఏ ఎస్ ఐ నూనె శ్రీనివాస్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఎనగంటి సంపత్, ప్రధాన కార్యదర్శి జీడి రవి, ఉపాధ్యక్షులు పాక అంజయ్య ,ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.