వల్భాపూర్ లో బాల వికాస ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన.

సీజనల్ వ్యాధుల పట్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వల్బపూర్ గ్రామ సర్పంచ్ ఎక్కెటి రఘుపాల్ రెడ్డి.

వీణవంక ఆగస్టు 18( జనం సాక్షి) వీణవంక: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వల్బాపూర్ గ్రామ సర్పంచ్ ఎక్కేటి రఘుపాల్ రెడ్డి గ్రామస్తులకు సూచించారు. వీణవంక మండలంలోని వల్భాపూర్ గ్రామంలో హన్మకొండ లక్ష్మి నరసింహ హాస్పిటల్ వైద్యులతో కలిసి బాలవికాస ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.లక్ష్మీ నరసింహ హాస్పిటల్ వైద్యులు 200 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. గ్రామ సర్పంచ్ ఎక్కేటి రఘు పాల్ రెడ్డి మాట్లాడుతూ వాన కాలంలో వ్యాపించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ,వానాకాలంలో డెంగ్యూ మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ప్రజలు తమ పరిసర ప్రాంతాలలో నీటి నిలువ ఉండకుండా చూసుకోవాలని , ఎప్పటికప్పుడు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు .ముఖ్యంగా వర్షాకాలంలో పిల్లలకు వృద్ధులకు ఎక్కువగా అంటువ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఒకరి నుండి మరొకరికి వ్యాధులు సోకకుండా ఉండేందుకు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటిస్తు ఏమైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని వారు సూచించారు .ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో వర్షపునీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని నీరు నిల్వ ఉన్నట్లయితే వాటిల్లో దోమలు అధిక మొత్తంలో గుడ్లు పెట్టి వాటి సంతాన ఉత్పత్తిని పెంచుకొని వ్యాధులకు కారకాలుగా మారే ప్రమాదం ఉందని అలా జరగకుండా ఎప్పటికప్పుడు తమ ప్రాంతాలలో పారిశుద్ధ్యం కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ప్రజల ప్రాణాలను రక్షించుకోవాలని సూచించారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న లక్ష్మీ నరసింహ హాస్పిటల్ వైద్యులను బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో వల్బాపూర్ గ్రామ సర్పంచ్ ఎక్కేటి రఘుపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ కాసవేణి కవిత, పంచాయతీ కార్యదర్శి రాజేందర్ కారోబార్ రాజశేఖర్ హన్మకొండ లక్ష్మీనరసింహ ఆసుపత్రి వైద్యులు తేజస్విని, నిక్కత్ పీఆర్వోలు సుభాష్ శ్రీకాంత్ బాల వికాస జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన కోఆర్డినేటర్లు సంధ్య సరోజన సుమలత తదితరులు పాల్గొన్నారు.