విజయవాడలో తిరుమల యాత్రలు
వెంకన్నను ముగ్గులోకి లాగొద్దన్న బుద్దా
విజయవాడ,మే23( జనం సాక్షి): విజయవాడలో తిరుమల యాత్రలు చేపట్టారు. ఓ వైపు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోవైపు బ్రాహ్మణ ఐక్యవేదిక సభ్యులు ఆందోళనకు దిగారు. తిరుమల ప్రతిష్టకు భంగం కలిగేలా వెంకన్న నగలుపై అపనిందలు వేస్తున్న వైసీపీ నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ విజయవాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ నాయకులు ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఇండిరాగాంధీ స్టేడియం నుంచి లబ్బీపేట వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు నిరసన యాత్ర చేపట్టారు. తిరుమల వెంకటేశ్వర స్వామిపై కూడా రాజకీయాలు చేస్తున్నారని బద్దా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దండుపాళ్యం గ్యాంగ్.. రాష్ట్రంలో లక్ష కోట్లు దోచుకుందని అన్నారు. అందులో ఏ-1 జగన్, ఏ-2 విజయసాయిరెడ్డి ఉన్నారని అన్నారు. వాళ్ల స్టోరీనే కర్నాటకలో సినిమాగా తీశారని, వాళ్లు దోచుకున్న డబ్బుతో ఒక పార్టీని స్థాపించి, ఒక వ్యవస్థగా మారుదామని, దండుపాళ్యం అనేదాన్ని ఇంకా విస్తరిద్దామనే ఒక ఆలోచనతో ఏపీలో ఒక పార్టీ పెట్టి కులాలు, మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. మోదీ, అమిత్ షా డైరక్షన్‌లో రాజకీయాలు చేస్తే ఇక్కడ ప్రజలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. అయితే వెంకటేశ్వర స్వామిని మాత్రం రాజకీయాల్లోకి లాగొద్దని, వాళ్లకు మంచి బుద్ధిని ప్రసాదించాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
బ్రాహ్మణ ఐక్యవేదిక శాంతియాత్ర
తిరుమల వివాదంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బెంజిసర్కిల్ నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతి యాత్ర నిర్వహించారు. బ్రాహ్మణ సామాజిక వర్గంపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని బ్రాహ్మణ ఐక్యవేదిక ప్రతినిధులు ఆరోపించారు. రమణదీక్షితుల విషయంలో ప్రభుత్వం వైఖరి దారుణమన్నారు. ఏడుకొండల స్వామి ప్రతిష్ట దెబ్బతీసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని బ్రాహ్మణ ఐక్య వేదిక ప్రతినిధులు మండిపడ్డారు.
రమణదీక్షితులు వ్యాఖ్యలు సరికాదు
ప్రభుత్వం, టీటీడీపై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్యలు సరికాదు బ్రాహ్మణసంఘం నాయకుడు ముష్టి శ్రీనివాస్ అన్నారు. టీటీడీ, చంద్రబాబు ప్రతిష్ట దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ, బీజేపీ వారి మెప్పు కోసమే అర్థం లేని ఆరోపణలు చేసుకున్నారని విమర్శించారు. తిరుమల పోటులో తవ్వకాలు ఏవిూ జరుగలేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు.