విద్యుత్ ఉద్యోగుల విభజనపై కీలక ఆదేశాలు
– ఏపీకి 613.. తెలంగాణకు 544 ఉద్యోగుల కేటాయింపు
హైదరాబాద్,అక్టోబర్ 5(జనంసాక్షి):గత కొన్నేళ్లుగా వివాదాస్పదంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంపై విచారణ జరిపిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ నిర్ణయాన్ని వెల్లడించింది. ఏపీ స్థానికత ఉన్నవారిలో 613 మంది ఉద్యోగులను ఏపీలో చేర్చుకోవాలని.. మిగతా 544 మందిని తెలంగాణలో కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన అనంతరం… ఏపీ స్థానికత ఉన్న 1157 మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీకి బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని పలువురు ఉద్యోగులు వ్యతిరేకించారు. మరో వైపు తమ వద్ద ఖాళీలు లేవని, వారందరిని చేర్చుకోలేమని ఏపీ ప్రభుత్వం కూడా పేర్కొంది. దీంతో విద్యుత్ ఉద్యోగుల విభజన అంశం వివాదంగా మారి.. సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. అందరితో చర్చించి పరిష్కారాన్ని సూచించేందుకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో కమిటీని సుప్రీంకోర్టు నియమించింది.
కొంతకాలంగా వివిధ అంశాలను పరిశీలించిన ధర్మాధికారి కమిటీ.. నిన్న ఇవాళ హైదరాబాద్లో రెండు రాష్ట్రాల విద్యుత్ అధికారులతో చర్చించింది. విభజన వివాదం సుదీర్ఘ కాలంగా తేలకపోవడంతో ఉద్యోగుల్లో – అసహనం పెరిగిపోతోందని కమిటీ అభిప్రాయపడింది. ఏపీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న 613 మందిని ఏపీలో చేర్చుకోవాలని, ఖాళీలు లేకపోతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలని స్పష్టం చేసింది. మిగతావారిని తెలంగాణలో కొనసాగించాలని పేర్కొంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న మరో 285 మంది ఉద్యోగులు తెలంగాణకు చెళామంటున్న విషయాన్ని కూడా పరిశీలించాలని ధర్మాధికారి కమిటీ నిర్ణయించింది. వాటికి సంబంధించిన వివరాలన్నీ తమకు సమర్పించాలని రెండు రాష్ట్రాల అధికారులను ఆదేశించింది. దీనిపై వచ్చే నెల 23 తేదీల్లో విజయవాడలో సమావేశమై విచారణ జరపనుంది.