విశాఖ స్టేషన్‌లో ప్రయాణికుల యాతన
శివార్‌ల్లో రైళ్ల నిలిపివేతతో ఇబ్బందులు
విశాఖపట్నం,మే21(జనం సాక్షి): విశాఖపట్నంలో రైలు ప్రయాణికులు నానా కష్టాలు పడుతున్నారు. శివారులో రైళ్లను నిలిపేసిన సమయంలో ప్రయాణికుల సహనానికే పరీక్ష పెడుతున్నారు. వాల్తేర్ డివిజన్ రైల్వే పరంగా కాసుల వర్షం కురిపిస్తున్నా… అభివృద్ధి పరంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతీ రైలు ఇంజన్ను ఇక్కడ మార్చాల్సిందే. దీంతో కనీసం అరగంటసేపైనా స్టేషన్లో నిలపాల్సి వస్తోంది. విజయవాడ, విజయనగరం వైపు నుంచి విశాఖకు వచ్చే రైళ్లన్నీ మర్రిపాలెం నుంచి ఒకే లైనులో విశాఖ స్టేషన్కు చేరుకోవాలి. ప్లాట్ ఫామ్‌లు ఖాళీ లేక.. మిగిలిన రైళ్లు అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, పెందుర్తి, సింహాచలం మార్గంలో ఒక దాని వెనుక ఒకటి గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం తూర్పు కోస్తా రైల్వే బల్ల్బైన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇదికూడా ఆచరణలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తాత్కాలిక పరిష్కారంగానైనా గోపాలపట్నం – విశాఖపట్నం మార్గంలో మూడో లైన్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు ఎన్నాళ్లనుంచో కోరుతున్నారు. పలు రైళ్లల్లో సాధారణ బోగీలు రెండు లేదా మూడే ఉంటున్నాయి. దీంతో సాధారణ ప్రయాణం నరకయాతనగా మారుతోంది.
————————–