వీర సైనికుల్లా గులాబీ దండు కదులాలే

– మంథని గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలే
– రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
జనంసాక్షి, మంథని : ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో గెలుపే లక్ష్యంగా గులాబీ దండు వీర సైనికుల్లా ముందుకు కదలాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కరీంనగర్‌లోని పీవీఆర్‌ ప్లాజా ఫంక్షన్‌హాల్‌లో జరిగిన మంథని నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శిక్షణా కార్యక్రమలో మంథని నియోజకవర్గ భీ ఆర్ ఎస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, భూపాల పల్లి జిల్లా పరిషత్ చైర్మన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రెండు రోజుల శిక్షణ నేపధ్యంలో నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. ఒక పట్టుదలతో కార్యకర్తలు రావడాన్ని చూస్తుంటే ఈసారి మంథని గడ్డపై గులాబీ జెండా ఎగురడం ఖాయమనేది కన్పిస్తోందని ఆయన అన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతీ కార్యకర్త తానే ఎంపీపీ, జెడ్పీటీసీ, ఏఎంసీ చైర్మన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అనుకుని ముందుకు సాగాలన్నారు. ఒక్కో కార్యకర్త మరో వంద మందిని తయారు చేయాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలో జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ చేస్తున్న అభివృధ్ది కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో పాటు ఆయనలో ఉన్న పట్టుదల, తపనను చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్పగా ఆలోచన చేసి మళ్లీ ఆయననే ప్రమోట్‌ చేశారని వివరించారు. తొమ్మిదేండ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, అన్నివర్గాలకు లబ్ది జరిగేలా ఆలోచన చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాల లబ్ది పొందాలంటే అక్కడ మన నాయకుడు ఉండాలని, ఇతర పార్టీల నాయకులు ఉంటే మన ప్రయోజనం జరుగదనే విషయాన్ని గుర్తించాలన్నారు. 40ఏండ్లు పరిపాలన చేసినోళ్లు ప్రాజెక్టులు కట్టించిండ్లా…నీళ్లు ఇచ్చిండ్లా, కరెంటు ఇచ్చిండ్లా, బడులు మంచిగా చేసిండ్లా అని ఆయన ప్రశ్నించారు. వాళ్లకు ఇలాంటి చేయడం చేతకాదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేశామని, నీళ్లు, కరెంటు కష్టాలు తీర్చామని, మన ఊరు మనబడి పేరుతో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించా మన్నారు. విద్యా, వైద్య రంగాలను ఎంతోఅభివృధ్దిచేశామని ఆయన గుర్తు చేశారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వపాలనలో ఏమైనా నెగిటివ్‌ ఉందో చూపించాలని ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించాలన్నారు. ప్రతి ఇంటిలో ఏదో ఒక పథకం ద్వారా లబ్ది జరిగి ఉంటుందని, అదే మనం వాళ్లకు చూపించాలన్నారు. ఎన్నికలు వస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్‌లు పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, అలాంటి మాటలను తిప్పి కొట్టాలన్నారు. గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పట్టుదలతో ముందుకు సాగాలని, రెండువేల మంది కార్యకర్తలు పుట్ట మధులా పనిచేయాలని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.