శ్రీవారి నగలన్నీ భద్రంగానే ఉన్నాయి

– 1952 నుంచి పక్కా లెక్కలున్నాయి
– వివాదాలపై న్యాయపరంగా ముందుకెళ్తాం
– శ్రీవారికి జరిగే కైంకర్యాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి
– బుందిపోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదు
– గులాబి వజ్రం రికార్డుల్లో లేదు
– విలేకరుల సమావేశంలో తితిదే ఈవో
అమరావతి, మే22(జ‌నం సాక్షి ) : శ్రీవారి నగలన్నీ భద్రంగానే ఉన్నాయని, తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ విషయంలో తలెత్తిన వివాదాలన్నింటిపైనా న్యాయపరంగా ముందుకెళ్తామని తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అన్నారు. గత కొద్ది రోజులుగా తితిదీలో జరుగుతున్న వివాదంపై పాలక మండలి సభ్యులు, ఈఓ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల వాస్తవాలపై ఈవో చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. అనంతరం బయటకొచ్చిన ఈఓ విలేకరులతో మాట్లాడారు. శ్రీవారి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని… ఆలయ ప్రతిష్ఠకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆలయ పవిత్రతకు భంగం కలిగించకుడా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తమను ఆదేశించినట్లు తెలిపారు. శ్రీవారికి వచ్చే నిధులన్నింటినీ సక్రమంగా వినియోగిస్తున్నామని.. ఎలాంటి దుర్వినియోగం చేయడం లేదన్నారు. శ్రీవారికి జరిగే కైంకర్యాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయన్నారు. రమణ దీక్షతులు ఆరోపిస్తున్నట్లుగా శ్రీవారి బూందీ పోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదన్నారు. స్వామివారి నగలకు సంబంధించి 1952 నుంచి పక్కా లెక్కలు ఉన్నాయని.. ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. శ్రీవారి ఆభరణాల్లో ఏది ఎవరిచ్చారన్న సమాచారం సమగ్రంగా లేకపోయినా.. 1952 రికార్టుల్లో ఉన్ననగలన్నీ భద్రంగా ఉన్నాయన్నారు. ప్రతి ఏడాది ఆలయంలోని నగలను తూకాలు వేస్తామని, మిల్లీ గ్రాము తక్కువ వచ్చినా రికార్డుల్లో చేర్చుతామన్నారు.  తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మాట్లడుతూ..ఇటీవల జెనీవాలో వేలం వేసిన గులాజీ రంగు వజ్రం శ్రీవారిదేనంటూ రమణ దీక్షితులు అనుమానం వ్యక్తం చేయడంపై స్పందించారు. అసలు అలాంటి వజ్రమే స్వామివారికి ఉన్నట్లు లెక్కల్లో లేదని.. లేని వజ్రాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. గరుడసేవలో వచ్చింది గులాబి డైమండ్‌ కాదని, కెంపు మాత్రమేనని సింఘాల్‌ స్పష్టం చేశారు. భక్తులు విసిరిన నాణెళిలకు కెంపు పగిలిపోయిందన్నారు. కెంపు పగిలిపోయిందని అప్పటి ఈవో ఐవైఆర్‌ నివేదిక ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ గుర్తు చేశారు.