శ్రీవారి భక్తులకు ఇబ్బందులు కలిగించొద్దు
– సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, మే24(జనం సాక్షి) : తిరుమలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమలలో భక్తుల రద్దీపై తితిదే, సీఎంవో అధికారులతో గురువారం ఉదయం చంద్రబాబు సవిూక్ష నిర్వహించారు. భక్తుల రద్దీని ముందే అంచనా వేసి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. తిరుమల గాలిగోపురం వద్ద భక్తుల రద్దీపై సీఎం స్పందించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సమాచారంతో అధికారులు అప్రమత్తం కావాలన్నారు. భక్తుల రద్దీపై విూడియాలో వచ్చిన వార్తలపైనా చంద్రబాబు ఆరా తీశారు. తిరుమలలో భక్తుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వెంటనే చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. స్వామివారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. భక్తులు ఎన్నో కష్టాల కోర్చి తమ కష్టాలు చెప్పుకునేందుకు స్వామివారి దర్శనానికి వస్తారని.. వారికి శ్రీవారి దర్శనభాగ్యం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల సేవే స్వామివారి సేవగా సిబ్బంది, అధికారులు భావించాలని సూచించారు. టిక్కెట్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరినందుకే సమస్య ఏర్పడిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన సీఎం ప్రత్యేక ప్రణాళికతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది రానివ్వదని ఆదేశించారు.