సభ్యత్వాలు పునరుద్ధరించండి
– లేదంటే కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేస్తాం
– స్పీకర్‌కు జానా నేతృత్వంలో సిఎల్‌పీ విజ్ఞప్తి
హైదరాబాద్,జూన్ 11(జనంసాక్షి):కోర్టు ఆదేశాలను మన్నిస్తూ ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్దరించాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం స్పీకర్ మధుసూధనాచారిని కోరింది. ఈమేరకు సిఎల్పీ నాయకుడు జనారెడ్డి నేతథ్వంలోని బృందం సోమవారం స్పీకర్ మధుసూధనాచారిని కలసి వినతిపత్రం సమర్పించింది. కోర్టు ఆదేశాల మేరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌ల సభ్యత్వాలను పునరుద్దరించి గౌరవాన్ని నిలపాలని కోరారు. సీఎల్పీ లీడర్ జానారెడ్డి నేతృత్వంలో స్పీకర్ మధుసూదనాచారితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాలు పునరుద్ధరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు వినతి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో హెడ్‌ఫోన్స్ విసిరి దాడికి పాల్పడ్డారంటూ కోమటిరెడ్డి, సంపత్‌ల శాసనసభ సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేసిన విషయం తెలిసింది. దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పువచ్చింది. అయితే ఈ తీర్పుపై కొందరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేశారు. కాగా అక్కడా వారికి చుక్కెదురైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాల రద్దు చెల్లదని తీర్పునిస్తూ, వారిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని వెల్లడించింది. బ్జడెట్ సమావేశాల సందర్భంగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని.. కోర్టు తీర్పును గౌరవించి వారి సభ్యత్వాలు పునరుద్ధరించాలని స్పీకర్‌ను కోరారు.
అనంతరం శాసనసభ ప్రాంగణంలో జానారెడ్డి విూడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చి 50 రోజులు పూర్తయినప్పటికీ దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. కోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేస్తుందని తాము భావించినప్పటికీ నిరాశే ఎదురైందన్నారు. ఈ అంశంలో హైకోర్టు రెండుసార్లు మొట్టికాయలు వేసినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఎమ్మెల్యేల సభ్యత్వ పునరుద్ధరణ విషయాన్ని అసెంబ్లీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరముందని అన్నారు. కోర్టు తీర్పు అమలు చేసి స్పీకర్ హుందాగా వ్యవహరించాలని, లేదంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకెళ్తామని జానారెడ్డి తెలిపారు. సంపత్, వెంకటరెడ్డి సభ్యత్వాలు పునరుద్ధరించాలని స్పీకర్‌ను కోరామని.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ చెప్పారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రపతిని కలిసి తెలంగాణలో పరిస్థితిని వివరిస్తామని చెప్పారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ తాను, సంపత్ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. మార్షల్స్ నెట్టేస్తే… తమ హెడ్‌ఫోన్స్ కిందపడేశామంతే అని వివరించారు. కోర్టు తీర్పు అమలు చేసేందుకు ఇంకా ఎన్ని రోజులు తీసుకుంటారని స్పీకర్‌ను అడిగామని కోమటిరెడ్డి తెలిపారు. ఇదిలావుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాల రద్దుపై మలిదశ పోరాటానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే కోర్టు ధిక్కారం కింద సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు రాష్ట్రపతిని కలవాలని, ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, త్వరలో నిర్వహించనున్న బస్సుయాత్రలోనూ ఈ అంశాన్ని ఫోకస్ చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. సభ్యత్వాల రద్దుపై తొలిదశలో 48 గంటల దీక్షలతో పాటు గవర్నర్‌ను కలసి శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాలని కాంగ్రెస్ నేతలు కోరారు. హైకోర్టునూ ఆశ్రయించారు. సభ్యత్వాల రద్దుకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. రెండు సార్లు తమకు అనుకూలంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఆ ఎమ్మెల్యేల విషయంలో పార్టీ పరంగా సరిగా స్పందించలేదని అంతర్గత చర్చల్లో అభిప్రాయపడిన నేపథ్యంలో మరో పోరాటానికి కాంగ్రెస్ నేతలు శ్రీకారం చుట్టారు. సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం నుంచి కార్యాచరణను నేతలు అమలు చేయనున్నారు. స్పీకర్‌ను కలవడంతో పాటు ఏఐసీసీ పెద్దల ద్వారా రాష్ట్రపతిని కలసి విన్నవించే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం ఇప్పటికే కబురు పంపారు.త్వరలోనే అపాయింట్‌మెంట్ లభిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతిని కలవడంతో పాటు కోర్టు ధిక్కారం కింద సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించనున్నారు. ఈ మేరకు పార్టీ తరఫు న్యాయవాదులు కసరత్తు ప్రారంభించారు.