సమస్యల పరిష్కారానికి టెక్నాలజీ జోడింపు 

లోకేశ్‌ వ్యూహంతో అధికారుల ఉరుకులు పరుగులు
విజయవాడ,మే18(జ‌నం సాక్షి ): మంత్రి పదవి చేపట్టిన తరవాత సిఎం తనయుడు, ఐటి శాఖ మంత్రి లోకేశ్‌ వినూత్న ఆలోచనలతో సమస్యల పరిష్కారంలో ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా టెక్నాలజీని ఉపయోగిస్తూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో కెటిఆర్‌ తరహాలనే సాగుతున్నా సమస్యలపై మరింత లోతుగా అధ్యనం చేస్తున్నారు. అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఆయా సమస్యలపై కిందస్థాయి నుంచి సమాచారం తెప్పించుకుని వాటి పరిష్కారానికి అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మంచినీటి సమస్య మొదలు అనేక సమస్యలను ఇలా నేరుగా తెలుసుకుంటున్నారు. జిల్లాల్లో మంచినీటి సమస్య నెలకొన్న ప్రాంతాల నుంచి నేరుగా ఫొటోలు రప్పించుకుంటున్నారు. గ్రామాల్లో నీటి సమస్యను పరిష్కరించేందుకు సోషల్‌ విూడియాతో  అలర్ట్‌ మేనేజ్‌మెంట్‌ను ఉపయోగించి పైలట్‌ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఎఎంఎస్‌ అలర్ట్‌ మేనేజ్‌మెంట్‌, జిపిఎస్‌ టెక్నాలజీని ఉపయోగించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కారం కోసం లోకేష్‌ టెక్నాలజీ వినియోగించు కుంటున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సరికొత్త సాప్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. దీనికోసం రియల్‌ టైం వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. మంచినీటి సమస్యలపై  పేపర్లు, చానెళ్లలో వస్తున్న  వార్తలను ఫిర్యాదులుగా స్వీకరించి ఉన్నతాధికారు లతో సవిూక్షిస్తున్నారు. గ్రామాల్లో నీటి సమస్యకు సంబంధించి సోషల్‌ విూడియాలో ఫొటోలతోసహా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా అధికారులను లోకేష్‌ పరుగులు పెట్టిస్తున్నారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా గ్రామాల్లో ఉన్న నీటి సమస్య గురించి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇందుకోసం అధునాతన కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. ముందుగా కరవు జిల్లాల్లో కాల్‌ సెంటర్‌ ట్రయల్‌ రన్‌ను ప్రారంభించారు. సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జెడ్పీటిసిలకు గ్రామాల్లో నీటి సమస్య ఉంటే కాల్‌ సెంటర్‌ నెంబర్‌కు ఫోన్‌ చెయ్యండి అంటూ మెసేజ్‌లు పంపారు. ఆ తరువాత ట్రయల్‌ రన్‌ను రాష్టవ్యాప్తంగా నిర్వహించారు. అన్ని జిల్లాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జెడ్పీటిసిల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.  ఒక గ్రామంలో మంచినీటి సమస్య ఉందని కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు రాగానే ఎఎంఎస్‌ అలర్ట్‌  మేనేజ్‌మెంట్‌ ద్వారా కిందిస్థాయి అధికారికి, సంబంధిత పైస్థాయి అధికారికి సమాచారం చేరుతుంది. కిందిస్థాయి అధికారి సమస్యను పరిష్కరించిన తరువాత రిపోర్ట్‌ను, సంబంధిత ఫొటోను పైస్థాయి అధికారికి పంపించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ గ్రామాల్లో సరఫరా అవుతున్న నీటి ట్యాంకర్లు పక్కదారి పట్టకుండా జిపిఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. నిధుల కొరత ఉందని తెలియగానే కరవు మండలాలకు రూ. 2లక్షలు, మిగిలిన మండలాలకు రూ. లక్ష చొప్పున అత్యవసర నిధులు కేటాయించారు. ఇప్పటివరకూ కాల్‌ సెంటర్‌ ద్వారా పరిష్కారమైన సమస్యలపై ప్రజల నుండి ఐవిఆర్‌ఎస్‌ ద్వారా అభిప్రాయాలు సేకరించారు. ప్రజాభిప్రాయ సేకరణలో 77 శాతం మంది సమస్య పరిష్కారమైందని, 23 శాతం మంది సమస్య పరిష్కారంలో ఆలస్యమైందని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకూ ఆయనకు సోషల్‌ విూడియా ద్వారా దాదాపుగా వేయి ఫిర్యాదులు అందాయి. ట్విట్టర్‌ లేదా మరే ఇతర సాధనం ద్వారా సమస్య రాగానే స్పందించి సంబంధిత
అధికారికి చేరవేస్తున్నారు. దీంతో అధికారులు అలర్ట్‌గా ఉండి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు.