సీతారామారావుకు 14రోజుల రిమాండ్‌

– ఏలూరు జైలుకు తరలించిన పోలీసులు 
ఏలూరు, మే24(జ‌నం సాక్షి) : అగ్రిగోల్డ్‌ కేసులో కీలక నిందితుడు, ఆ సంస్థ మాజీ డైరక్టర్‌ అవ్వా సీతారామారావుకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించింది. దీంతో సీతారామారావును ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు. గత మూడేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న సీతారామారావును ఢిల్లీలోని గుడ్‌గావ్‌లో సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 48 గంటలలో ఆయన్ని పశ్చిమగోదావరి జిల్లా కోర్టుకు తీసుకువచ్చారు. సీతారామారావును గుడ్‌గావ్‌లో అరెస్టు చేసిన సమయంలో ఆయన ఇంట్లో విలువైన పత్రాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అగ్రిగోల్డ్‌ కేసులో సీతారామారావుపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన కుటుంబసభ్యులకు బెయిల్‌ ఇప్పించటానికి ఆయన ముమ్మర ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1997 నుంచి 2013 వరకు అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌గా ఉన్న సీతారామారావు అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులను బినావిూల విూదకు మళ్లించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అగ్రిగోల్డ్‌ సంస్థను ఏఎస్‌ఎల్‌ సంస్థ టేకోవర్‌ చేసుకోకుండానూ అవరోధాలు సృష్టించినట ఆరోపణలు నెలకొన్నాయి.