స్టార్టప్ విలేజ్ వ్యవహారాలపై లోకేశ్ ఆరా?
విశాఖపట్టణం,మే18(జనం సాక్షి ): విశాఖలో ఆర్భాటంగా ప్రారంభమైన స్టార్టప్ విలేజ్ మూతపడే స్ధాయికి చేరింది. దీనిపై వచ్చిన ఫిర్యాదులను ఐటి శాఖ మంత్రి లోకేశ్ సీరియస్‌గా తీసుకుని ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే చాలావరకు స్టార్టప్‌లు మూతపడ్డాక పాలసీ మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అనుకున్న లక్ష్యం నెరవేరకపోగా కోట్లలో ప్రభుత్వానికి చేతి చమురు వదిలింది. ఇపుడు స్టార్టప్ విలేజ్ అంటేనే యువత వెనకంజ వేస్తున్నారని సమాచారం. విశాఖలో ఐటిలో చోటు చేసుకున్న పరిణామాలపై ఐటి మంత్రి నారాలోకేష్‌కు ఫిర్యాదులు అందాయని సమాచారం. దీంతో ఆర్భాటంగా ప్రారంభించిన సంస్థలను మూసేస్తే ప్రభుత్వం పరువు పోతుందని ఆయనకు సలహాలు ఇచ్చారు. దీంతో ఆయన వీటిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్టప్‌లతో ఆశపడి వచ్చిన నిరుద్యోగ యువతకు చుక్కలు చూపించారు. ఇంజనీరింగ్ విద్యార్ధులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామంటూ విశాఖలో ప్రారంభమైన స్టార్టప్ విలేజ్ దాదాపుగా మూతపడే స్థాయికి చేరుకుంది. ప్రారంభించిన రెండేళ్ళలోనే యువతకు చేదు అనుభవం మిగిలింది. కొన్ని ప్రైవేటు కంపెనీలతో ఒప్పంద ఫలితంగా వీటి అవసరం లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఆశతో వచ్చిన యువపారిశ్రమికవేత్తలు మండిపడుతున్నారు. ఐటిపై కొత్త తరహా విధానాన్ని అమలు చేస్తున్నామంటూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్టార్టప్ విలేజ్‌కు శ్రీకారం చుట్టారు. పట్టభద్రులైన ఇంజనీరింగ్ విద్యార్ధులను యువ పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం సన్ రైజ్ స్టార్టప్ విలేజ్ ఉద్దేశ్యం. రుషికొండ ఐటి పార్క్ హిల్ నెంబర్ 3లో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసారు. దీనికి సన్ రైజ్ స్టార్టప్ విలేజ్ అని పేరుపెట్టి చంద్రబాబు 2014లో ప్రారంభించారు. స్టార్టప్ లతో వచ్చే యువతకు మార్గదర్శనం చేయడానికి కేరళకు చెందిన సంజయ్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన పనిచేయకుండా ఇద్దరు సహాయకులను నియమించి పని ప్రారంభించారు. 160 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు స్టార్టప్‌లతో సిద్దంగా ఉన్నా తగిన మార్గ నిర్దేశకత్వం లేకపోవడంతో ఇక్కడ టైమ్ వేస్ట్ అని చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. చివరికి ఎపి ప్రభుత్వం నుంచి భారీగా నజరానా అందుకున్న సంజయ్ కుమార్ సైతం తన సహాయకులను బెంగళూరు కు తీసుకెళ్ళడంతో స్టార్టప్ విలేజ్ బోసి పోయింది. స్టార్టప్ బాధ్యతలను ఎపి ఇన్నోవేటివ్ సొసైటీ సిఇవో నిఖిల్ అగర్వాల్ బాధ్యతలు తీసుకున్నక పరిస్ధితి ఏమాత్రం మెరుగుపడలేదు.
చివరికి దీంతో సర్కారుకు 50 కోట్ల నష్టం వాటిల్లిందని సమాచారం. ఎందుకు పెట్టారో, ఎందుకు విఫలమైందో తెలియకున్నా ఉన్న యువతను ఖాళీ చేసి వెళ్ళాలంటూ నోటీసులు ఇవ్వడంతో
షాక్ తిన్నారు. దీంతో వ్వయహారాన్ని కొందరు లోకేశ్ దృష్టిలో పెట్టారని సమాచారం. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని చూస్తున్నారు.