హుజుర్‌నగర్‌ మాదే కేటీఆర్‌ 

– టీఆర్‌ఎస్‌దే విజయం తథ్యం
– కాంగ్రెస్‌ మునిగిపోయే నావ
– టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌,అక్టోబర్‌ 1 (జనంసాక్షి):  హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోతున్న పడవ అని ఆ పార్టీకి ప్రజలు ఓటు వేయరని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ ప్రచార ఇంఛార్జ్‌లతో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంగళవానం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రచారశైలి, ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ప్రచారం ఉదృతంగా సాగుతుందన్నారు. ప్రజల నుంచి టీఆర్‌ఎస్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందన్నారు. హుజూర్‌నగర్‌ నుంచి వస్తున్న క్షేత్రస్థాయి రిపోర్టులు అద్భుతంగా ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ వంద శాతం గౌరవప్రదమైన మెజార్టీతో గెలుస్తదన్నారు. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ఘోర పరాభవాన్ని ఎదుర్కొని ఇప్పుడు విడివిడిగా కలబడుతున్న విపక్షాల అనైక్యతను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం లేని కాంగ్రెస్‌ ఎలా అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి హుజూర్‌నగర్‌లో ఘోర పరాజయం తప్పదన్నారు. పోటీలో ఉన్న టీడీపీ, బీజేపీకి ప్రజల నుంచి స్పందన ఉండదన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ హుజూర్‌నగర్‌లో తొలిసారి గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని పేర్కొన్నారు.
ఉత్తమ్‌ వాదన శుద్ధ తప్పు..
గత ఐదేళ్లకు పైగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో హుజూర్‌నగర్‌ అభివృద్ధి జరగలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేస్తున్న వాదన శుద్ధ తప్పు, పచ్చి అవాస్తవం అన్నారు. హుజూర్‌నగర్‌లోనూ మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్ల లాంటి అన్ని ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆ అభివృద్ధి, సంక్షేమాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చూడడం లేదు. గత ఐదేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఈసారి టీఆర్‌ఎస్‌కు విజయాన్ని అందిస్తాయన్నారు. గత ఐదేళ్లలో ఎమ్మెల్యేగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏనాడు ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదన్నారు. ఇదే హుజూర్‌నగర్‌ నియోజకవర్గంపై ఉత్తమ్‌కు ఉన్న నిబద్ధన్నారు. అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్‌ నియోజకవర్గంపై ఎలాంటి విపక్ష చూపకుండా రాష్ట్రంలోని అన్ని ఇతర నియోజకవర్గాలతో సమానంగా ప్రభుత్వ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. హుజూర్‌నగర్‌ అభివృద్ధి చేయలేదని చేస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసత్య ఆరోపణలను ప్రజలు పట్టించుకోరన్నారు. గత ఐదేళ్లుగా అన్ని రంగాల్లో హుజూర్‌నగర్‌లో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు కచ్చితంగా టీఆర్‌ఎస్‌కే ఓటేస్తారన్నారు. ప్రజలు వెయ్యి శాతం టీఆర్‌ఎస్‌ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారన్నారు. ఐదేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని అక్కడి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ పదిహేను రోజులపాటు విస్తృతంగా ప్రచారం కొనసాగించాలన్నారు. 4వ తేదీతో పాటు దసరా పండుగ తర్వాత ఒకటి, రెండు రోజులు హుజూర్‌నగర్‌ ప్రచారంలో పాల్గొననున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు.

తాజావార్తలు