2019లోనూ టీడీపీదే అధికారం
– బీజేపీ మిత్రబంధాన్ని మరిచి రాష్ట్రానికి అన్యాయం చేసింది
– జగన్ ఏనాడైనా బీజేపీని నిలదీశాడా?
– కేసుల మాఫీకోసం జగన్ బీజేపీ చేతిలో కీలుబొమ్మలా మారాడు
– మినీ మహానాడులో మంత్రి సుజయ్
విజయనగరం, మే24(జనం సాక్షి) : వచ్చే ఎన్నికల్లో తెదేపాదే అధికారం, రాష్ట్రంలో ఆర్థికలోటు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతమైన పాలన అందించారని మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. ఆనంద గజపతి ఆడిటోరియంలో గురువారం మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ బీజేపీ మిత్రబంధాన్ని మరచి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రాన్ని ఆశాస్త్రీయంగా విభజించినందుకు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం ఎలా చెప్పారో.. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి కూడా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. వైసీపీ, జనసేనకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని వ్యాఖ్యానించారు. బీజేపీ ఆదేశాలతో వైసీపీ నడుస్తోందని ఆరోపించారు. ప్రత్యేక ¬దా ఇవ్వాల్సింది బీజేపీ… కానీ ఏనాడైనా బీజేపీని జగన్ నిలదీశారా? అని ప్రశ్నించారు. మైనార్టీలను జగన్ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2019లో అధికారంలోకి వచ్చేది టీడీపీనేనని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా బొత్సపై మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బొత్స సత్యనారాయణ గెస్ట్ పొలిటీసియన్ అని ఆరోపించారు. బొత్స కుటుంబం కాంట్రాక్టర్ల నుంచి కవిూషన్లకు కక్కుర్తి పడి ఏ ప్రాజెక్టు పూర్తిచేయలేదన్నారు. బొత్స అవినీతికి ఉద్యోగులు కూడా బలయ్యారని విమర్శించారు. జిల్లా అభివృద్ధిపై బొత్స చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు పాల్గొన్నారు.