30, 31న బ్యాంకుల సమ్మె
– విభజించు.. పాలించు అనే పద్ధతిలో కేంద్రం విధానాలు
– యూఎఫ్‌బీయూ నాయకులు
విజయవాడ, మే24(జనం సాక్షి) : ఈనెల 30, 31 తేదీల్లో బ్యాంకుల సమ్మె నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ అఫ్ బ్యాంక్ యూనియన్స్ నాయకులు తెలిపారు. గురువారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలో అక్రమార్కులు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేస్తుంటే బ్యాంకులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ఈనెల 30, 31 తేదీల్లో దేశంలోని అన్ని బ్యాంకు ఉద్యోగ సంఘాలు 48 గంటలపాటు నిరవధిక సమ్మెకు దిగుతున్నాయని తెలిపారు. ఉద్యోగులను విభజించు.. పాలించు అనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయని నాయకులు ఆరోపించారు. ఉద్యోగులను విభజించి చేస్తున్న పే సెటిల్మెంట్‌కు తాము వ్యతిరేకం అని అన్నారు. వేతన సవరణ ఉద్యోగులకు అత్యంత అవమానకరంగా 2శాతం మాత్రమే చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 15శాతం వేతనాన్ని సవరణ చెయాల్సి ఉండగా బ్యాంకర్ల పరిస్థితి బాగోలేదని చెబుతున్నారని వారు పేర్కొన్నారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వంటి వాళ్లు ఎగ్గొట్టిన రుణాలను ఆయా బ్యాంకులు మినహాయించి బ్యాంక్‌కు వచ్చిన లాభాల్లో 2శాతం వేతనాన్ని పెంచుతామనడం సిగ్గు చేటన్నారు. ఒక్క నీరవ్ మోడీ వల్లే పీఎన్‌బీ రూ.11 వేల కోట్లకు పైగా నష్టపోయిందని తెలిపారు.
————————-