అంతర్జాతీయ వాణిజ్య సంస్థలకు

కేంద్రంగా హైదరాబాద్‌
– దేశంలోనే హైదరాబాద్‌ నగరంలో మొట్టమొదటి ఐకియా షోరూమ్‌
– ఐకియా స్టోర్‌ను ప్రారంభించిన ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌
– భారత్‌లో 10,500 కోట్ల పెట్టుబడులే లక్ష్యం
– హైదరాబాద్‌లో స్టోర్‌ కోసం రూ. వెయ్యికోట్లు ఖర్చు చేశాం
– 7,500 రకాల వస్తువులు స్టోర్‌లో అందుబాటులో ఉంచాం
– ఐకియా సీఈఓ భారత సీఈఓ పీటర్‌ బెట్జెల్‌
హైదరాబాద్‌, ఆగస్టు9(జ‌నం సాక్షి) : హైదరాబాద్‌ నగరంలో అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయని, అంతర్జాతీయ సంస్థలకు నగరం కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీశా మంత్రి కె.తారక రామారావు అన్నారు. హైటెక్‌ సిటీ సవిూపంలో దేశంలోనే మొట్టమొదటి ఐకియ షోరూమ్‌ను గురువారం మంత్రి ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయన్నారు. నాణ్యమైన, పేరున్న కంపెనీలు రావడం వల్ల తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ప్రారంభించిన ఐకియ ద్వారా దాదాపు 2వేల మందికి ప్రత్యక్షంగా, 3వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. షోరూమ్‌కు వచ్చే వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఆఫర్లను ఐకియా ప్రకటించిందన్నారు. అనంతరం ఐకియా భారత సీఈఓ పీటర్‌ బెట్జెల్‌ మాట్లాడుతూ..
భారతదేశంలో మొత్తం రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టాలని తమ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల విూద రూ.4,500 కోట్లు వెచ్చించామని ఐకియా భారత సీఈఓ పీటర్‌ బెట్జెల్‌ తెలిపారు. ఇందులో హైదరాబాద్‌ స్టోరు కోసం రూ.1,000 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇంట్లో ఉపయోగపడే చిన్న వస్తువుల మొదలు.. గది అలంకరణ సామాగ్రి, ఫర్నిచర్‌ ఇలా దాదాపు 7,500వరకూ వస్తువులను ఈ స్టోరులో అందుబాటులో ఉంచామన్నారు. వంటగది, పడకగది, హాలు తదితరాల నమూనాలు కూడా చూడొచ్చని తెలిపారు. భారత ప్రజల అవసరాలను అర్థం చేసుకునేందుకు 1,000కి పైగా గృహాలను సందర్శించి సర్వే చేశామని పేర్కొన్నారు. తాము విక్రయించే వస్తువుల్లో 20శాతం వరకూ ఇక్కడ తయారైనవే ఉంటాయనీ, మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. దీనికోసం స్థానిక
తయారీదారులు, సరఫరాదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని సీఈఓ తెలిపారు.
వెయ్యి మంది ఒకేసారి కూర్చొనే భారీ రెస్టారెంట్‌..
ఆకలితో ఉన్నవారు సరైన కొనుగోలు నిర్ణయం చేయలేరనే భావనతో ప్రత్యేకంగా రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసినట్లు ఐకియా పేర్కొంది. ఇందులో తక్కువ ధరలకే ఆహార పదార్థాలు అందిస్తామని తెలిపింది. దేశీయ వంటకాలతో పాటు, స్వీడిష్‌ రుచులను కూడా ఇక్కడ పరిచయం చేయనున్నారు. ఇందులో ఒకేసారి 1,000 మంది కూర్చునే వీలుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడే ఉన్న స్మాలాండ్‌లో ఆడుకునేందుకు వదిలిపెట్టి, స్టోర్‌లో కొనుగోలు కోసం వెళ్లవచ్చు.
ఐకియా స్టోర్‌ ప్రత్యేకతలు..
– హైటెక్‌ సిటీ వద్ద 13 ఎకరాల స్థలంలో సుమారు 4లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్రాంగణం
– 7,500 రకాల వస్తువులు ఇక్కడ లభించనున్నాయి.
– ఇందులో 1,000కి పైగా వస్తువుల ధర రూ.200లోపే లభ్యమవుతాయి
– ప్రత్యక్షంగా 950మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇందులో సగం మంది మహిళా ఉద్యోగులు.
– పరోక్షంగా మరో 1,500 మందికి ఉపాధి కల్పన