అంధత్వ రహిత తెలంగాణెళి లక్ష్యం

– ఆగస్టు 15 నుంచి ‘కంటి వెలుగు’

– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 129 బృందాలు

– రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి

– జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ‘కంటి వెలుగు’పై అవగాహన సదస్సు

హైదరాబాద్‌, ఆగస్టు9(జ‌నం సాక్షి) : రాష్ట్రాన్ని అంధత్వ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు రవాణాశాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 50 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఖైరతాబాద్‌ లోని రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో కంటివెలుగు కార్యక్రమంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్‌ సునీతా మహేందర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన సదస్సుకు రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు రఘునందనరావు, వర్శిణి, ఎంవీరెడ్డితో పాటు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి హాజరయ్యారు. కంటి వెలుగుపై జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా అధికారులకు అవగాహన కల్పించారు. రంగారెడ్డి జిల్లాలో 55 బృందాలు, వికారాబాద్‌ లో 22 బృందాలు, మేడ్చల్‌ జిల్లాలో 52 బృందాల ద్వారా క్యాంపులు నిర్వహించి గ్రామాల్లో రోజుకు 250 మందికి, పట్టణాల్లో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశానికి ఆదర్శంగా నిలిచే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌ రెడ్డి కోరారు. ఒకేసారి నిర్ణీత గడువులోగా మూడున్నర కోట్ల మంది ప్రజలకు కంటి వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు, కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవడం ఎంతో మంది బీద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఒక్కొక్కసారి వేల రూపాయలు ఖర్చు చేయలేక బీదలు అంధత్వానికి గురవుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాలని అవకాశాలను సద్వినియోగ పర్చుకునేలా కృషి చేయాలన్నారు.నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆరంభించనున్న కంటి వెలుగు కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లన్ని సిద్ధం చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 50 లక్షల మందికి వైద్య పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని ఎంపికచేసి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఇందుకు అవసరమైన వారికి ఆపరేషన్లను చేయడంతోపాటు 50 లక్షలకు పైగా కంటి అద్దాలను కూడా సిద్ధంగా ఉంచడం జరిగింద పేర్కొన్నారు.