అన్నవరం రోడ్డుపై తరచూ ప్రమాదాలు

నివారణా చర్యలు తీసుకుంటేనే మనుగడ
కాకినాడ,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రమాదాలు జరగకుండా కనీస చర్యలు కూడా చేపట్టక పోవడంతో పెను ప్రమాదాలకు దారితీస్తోంది. ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు బస్సులు, వేల కార్లు ఇతర
వాహనాలు అనేకం రాకపోకలు సాగించే ముఖ్యమైన కూడలి కాడంతో సరైన జాగ్రత్తలు లేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నవరం సత్యదేవుని దర్శనానికి నిత్యం వేలాది వాహనాల్లో రాష్ట్ర నలుమూలల నుంచి వస్తుంటారు. ఇక్కడి జాతీయ రహదారి నుంచి అన్నవరం గ్రామంలోకి వచ్చే కూడళ్లు
ప్రమాదకరంగా మారాయి. ఆర్టీసీ, ప్రయివేటు ఏ బస్సైన అన్నవరం కాంప్లెక్స్‌కు వచ్చి వెళ్తుంటాయి. తుని నుంచి అన్నవరం వైపు జాతీయ రహదారిపైవచ్చే వాహనాలు అన్నవరంలోకి రావడానికి, ఇక్కడి నుంచి రాజమహేంద్రవరానికి వెళ్లేందుకు రెండు కీలక జంక్షన్లు దాటాల్సి ఉంటుంది. ఇలా వేగంగా మలుపులు తిరుగుతున్నప్పుడు అనేక ప్రమాదాల్లో చోటు చేసుకుంటున్నాయి. అన్నవరం నుంచి రాజమహేంద్రవరంకు వెళ్లే కూడలిలో కూడా అనేక ప్రమాదాల్లో ఎంతో మంది ద్విచక్ర వాహనదారులు మృతి చెందారు. మూడేళ్ల కాలంలో ఈ కూడళ్లలో అనేకులు మృతిచెందారు. వాహానాలు వేగంగా వచ్చే సమయాల్లో మలుపు తిరుగుతున్న వాహనాలను గమనించకపోవడం వల్లే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన కూడళ్ల వద్ద అండర్‌పాస్‌ వంతెన నిర్మాణాలు చేయకపోవడమూ మరో కారణమే. కొంతకాలంగా తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిధిలోని జాతీయ రహదారిపై అధిక శాతం ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం భయాందోళనకు గురిచేస్తుంది. తుని జాతీయ రహదారిపై తలుపులమ్మలోవ జంక్షన్‌, పెద్ద రైల్వేగేటు జంక్షన్‌, తేటగుంట, అన్నవరం, బెండపూడి ధర్మవరం, ప్రత్తిపాడు ప్రాంతాల కూడళ్లలో ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో కనీసం హెచ్చరిక బోర్డులు లేకపోవడం విశేషం.రద్దీ ట్రాఫిక్‌ ఉండే కూడళ్లలో కనీసం హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడం వల్ల కూడా ప్రమాదాలకు కారణమవు తున్నాయి. అన్నవరం జాతీయరహదారి కూడలి వద్ద ట్రాఫిక్‌ అధికంగా ఉంటుండటంతో  రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.