ఆదివాసీ చరిత్రకు అద్దం పట్టే మేడారం సమ్మక్క- సారలమ్మ మ్యూజియం..

ములుగు(మేడారం), ఫిబ్రవరి15(జనంసాక్షి):- భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధిక సంఖ్యలో భక్తులను ఆకర్షించేది మేడారం జాతర.ఈ జాతరలో కోటి మందికి పైగా భక్తులు పాలు పంచుకుంటారు.ఇంతటి ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2012లో సుమారు రూ. మూడు కోట్ల నిధులతో మేడారంలో మ్యూజియం కట్టాలని,కోయ దేవతను తీసుకువచ్చే చిలుకల గుట్టకు కంచె కట్టి పరిరక్షించాలని నిర్ణయించింది.2016లో మేడారానికి అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిధులు కేటాయించింది.2017లో చిలుకలగుట్ట చుట్టూ కంచె కట్టడం పూర్తయింది. మ్యూజియం భవనం నిర్మాణం కూడా 2018 డిసెంబర్ నాటికి పూర్తయింది.గిరిజన సాంస్కృతిక పరిశోధన,శిక్షణ సంస్థ అధికారులు ఈ మ్యూజియాన్ని సందర్శించి అందులో ఉన్న సుమారు 12 మ్యూజియం బయట ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించి వాటిల్లో కోయ జీవన సంస్కృతులకు సంబంధించిన వస్తువులు,కళాఖండాలు, చిత్రాలు,ఫోటోలు,సమ్మక్క – సారలమ్మల వీరగాధలోని ప్రధాన ఘట్టాలను శిల్పాలలో ఎలా చిత్రీకరించాలో ప్రణాళికలు రచించుకున్నారు. అనుకున్న ప్రకారం అన్ని పనులు పూర్తాయి.మేడారం జాతర 2018 జనవరి 23 నాటికి ఈ మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.