పాలన లేని రాష్ట్రంలో.. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం అట: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: ఎంతోమంది పోరాటం వల్ల స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు ఉంటారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని సూచించారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం యువత ఎదురుచూస్తున్నారని.. రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. రైతు భరోసా, పింఛన్ ఎప్పుడిస్తారన్నారు. రూ.2500 ఎప్పుడిస్తారని ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు దెబ్బతిన్నారని విమర్శించారు. ఒక్క నెలలో 30 హత్యలు అయ్యాయని పత్రికలు రాస్తున్నాయని చెప్పారు. హోం మంత్రిని పెట్టి శాంతిభద్రతలు కాపాడాలన్నారు.