మరోసారి రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ లడ్డూ
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్ చేస్తూ 30 లక్షల వెయ్యి రూపాలయకు కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. 1116 రూపాయలతో ప్రారంభమైన వేలం పాట క్రమంగా పెరుగుతూ.. రూ.30 లక్షల వద్దకు చేరుకుంది. ఆ తర్వాత ఎవరూ వేలం పాట పాడేందుకు ముందుకు రాకపోవడంతో కొలను శంకర్ రెడ్డికే బాలాపూర్ లడ్డూ దక్కింది.రాష్ట్రంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించే లడ్డూ వేలం అంటే ముందుగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేషుడే. ఏటా బాలాపూర్‌లో గణేషుడికి భారీ లడ్డూ నైవేద్యంగా పెడుతుంటారు. బాలాపూర్ లడ్డూ బరువు 21 కిలోలు. 1980లో మొదలైన ఈ సంప్రదాయాన్ని నిర్వాహకులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇక లడ్డూ వేలాన్ని తొలిసారిగా 1994లో నిర్వహించారు. ఆ సమయంలో రూ.450 ధర పలికింది. అప్పటి నుంచి ఏయేడాది కాయేడు రికార్డు ధరల పలుకుతూ లడ్డూ ప్రసాదం రూ.వందల నుంచి రూ.లక్షలకు చేరింది. గతేడాది రికార్డు స్థాయిలో రూ.27లక్షలకు పెరిగింది. గతేడాది స్థానికేతరుడైన దాసరి దయానంద్ రెడ్డి ఈ భారీ లడ్డూను దక్కించుకున్నారు. ఇక ఈ ఏడాది ఏకంగా రూ.30 లక్షలు ధర పలకడం విశేషం.ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. ఈ ఏడాదితో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకున్నది. ఈ నేపథ్యలో లడ్డూకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తొలిసారిగా నిర్వాహకులు వేలంలో కొత్త నిబంధనను తీసుకువచ్చారు. లడ్డూ వేలంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ముందస్తుగా డబ్బును డిపాజిట్ చేయాలని నిబంధనను తెచ్చారు. ఈ సారి అయోధ్య రామమందిరం నమూనాలో ఏర్పాటు చేసిన మండపంలో బాలాపూర్ గణపతి కొలువుదీరి పూజలందుకుంటున్నారు. మంగళవారం చివరి పూజ అనంతరం బాలాపూర్ బొడ్రాయి దగ్గర వేలంపాటను బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వహించింది. లడ్డూ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని అభివృద్ధి పనులకు వినియోగించనున్నారు.