జెండర్ జస్టీస్..
` వాళ్లనూ మనుషులుగా గుర్తించారు
` ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో గుర్తింపునిచ్చేలా సీఎం రేవంత్ నిర్ణయం
` ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమిస్తామనే సర్కారు ప్రకటనపై హర్షం
` విధులకు మేమూ సంసిద్ధంగా ఉన్నామంటున్న హిజ్రాలు
` తెలంగాణలో పుట్టిపెరిగిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి
` అందరికీ ఉపాధి కల్పిస్తే బిక్షాటన చేయబోమని స్పష్టం
హైదరాబాద్ కరస్పాండెంట్ (జనంసాక్షి)
ఆధునిక సమాజం, అంతర్జాల జీవనం శరవేగంగా జనజీవన స్రవంతిని ప్రభావం చేస్తున్నప్పటికీ పురుషాహంకార జాడలు అక్కడక్కడ ప్రస్ఫుటిస్తూనే ఉన్నాయి. మహిళలను మనుషులుగా గుర్తించాలని వందల ఏండ్లుగా ఎంతోమంది సంఘసంస్కర్తలు, ప్రజాసంఘాలు, మహిళా ఉద్యమకారులు పోరాటాలు చేసినా నేటికీ పురుషులతో సమానంగా ఆడవాళ్లను ఆమోదించడం కష్టంగానే ఉన్నది. ఇలాంటి పురుషాధిక్య సమాజంలో బిక్కుబిక్కుమంటూ కాలంవెళ్లదీస్తున్న ట్రాన్స్‌జెండర్లు అసలు మనుషులే కాదన్నట్టు భావిస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయం వారి జీవితాలకు దారిదీపంలా మారింది. ఏ రోడ్డు మీద మానప్రాణాలను ఫణంగా పెట్టి అడుక్కుంటున్నారో.. అదే రోడ్డు మధ్యలో వారి ఆత్మగౌరవం ఇనుమడిరచేలా ట్రాఫిక్ నియంత్రకులుగా నియమించాలనే ఆలోచనను అందరూ అభినందిస్తున్నారు.
ఏండ్ల తరబడి అవమానాలు, ఛీత్కారాలు అనుభవిస్తున్న హిజ్రాలు సమాజంలో మూడో రకం మనుషులుగానూ సరైన గుర్తింపు నోచుకోవడం లేదు. నిర్దిష్టమైన జీవనాధారం లేక, ఏ రంగంలోనూ వారిని ప్రోత్సహించేవారు లేక రోడ్లపై బిక్షాటన చేయడమే బతుకుగా ఎంచుకున్నారు. అయినప్పటికీ సమాజం వారిని అంగీకరించిన పరిస్థితులున్నాయి. నిత్యం హేళన, గేలి చేయబడుతూ నిరాశతోనే బతుకు బండి సాగిస్తున్నారు. పట్టుదల ప్రదర్శిస్తున్న కొందరు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు, వివిధ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే కేరళ, తమిళనాడులో ముగ్గురు హిజ్రాలు సబ్ ఇన్‌స్పెక్టర్లుగా ఉద్యోగాలు సాధించడం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. కరోనా సమయంలోనూ డాక్టర్లుగా ఉన్న ట్రాన్స్‌జెండర్లు కోవిడ్ పేషంట్లకు సేవలందించి ఆదర్శంగా మారారు. తెలంగాణలోనూ ట్రాన్స్‌జెండర్లకు ఉపాధినిచ్చి, వారి సేవలను సేవలను వినియోగించుకోవాలనే కొత్త ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రద్దీని నియంత్రించేందుకు వారిని నియమించుకోవాలని భావించిన ప్రభుత్వం.. ప్రత్యేక శిక్షణతో పాటు విధులకు కావాల్సిన సదుపాయాలను కల్పించనుంది. హోంగార్డుల తరహాలో ఇకనుంచి వారు సేవలందించే అవకాశముంది. సర్కారు ప్రకటన వారిలో కొత్త ఆశలు చిగురింపజేయగా.. ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రేటర్‌వ్యాప్తంగా విధులు
గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం ఐదు జోన్ల పరిధిలో 30 సర్కిళ్లు ఉండగా.. నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్‌తో ప్రజారవాణా ఇబ్బందికరంగా మారింది. కరోనా తర్వాత సొంత వాహన సౌకర్యాలు అధికమై గతానికంటే భిన్నంగా నగరవ్యాప్తంగా రద్దీ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ విభాగంలో నియమించి వారి ఉపాధి మార్గం కల్పించాలని నిర్ణయించడం గమనార్హం. వివిధ లెక్కల ప్రకారం తెలంగాణలో దాదాపు 2వేల వరకు ట్రాన్స్‌జెండర్లు ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వారితో కలిపి ఆ సంఖ్య అధికంగానే ఉన్నది. అందులో మొదటగా నగరంలో ఉన్నవారికి శిక్షణనిచ్చి ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించనున్నారు. ప్రతి నెలా వేతనం కూడా అందించనున్నారు. ఆసక్తి, అర్హత ద్వారా ఎంపిక చేసి, విధుల్లో ఉండేవారికి స్పెషల్ డ్రెస్ కోడ్ కూడా ఇవ్వనున్నట్టు తెలిసింది. త్వరలోనే ఈ ప్రక్రియ ముగించాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు శాఖకు కూడా సూచించారు. తమకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి ఆదరించాలని ఏండ్లుగా కొట్లాడుతున్న ట్రాన్స్‌జెండర్లకు తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం సమాజంలో ఆత్మగౌరవాన్నిచ్చేదే..!
థ్యాంక్స్ రేవంతన్నా..
` చంద్రముఖి, తెలంగాణ హిజ్రా ట్రాన్స్‌జెండర్ సమితి ఫౌండర్ మెంబర్
మాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషిచేసిన సీఎం రేవంతన్నకు రుణపడి ఉంటాం. ప్రజావేదిక వద్దకు వెళ్లి ఆయనకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. ఈ నియామకాల్లో మొదటగా తెలంగాణలో పుట్టిపెరిగిన హిజ్రాలకు ప్రాధాన్యత కల్పించాలి. ఆ తర్వాత మిగతావారిని కూడా ఏదోక శాఖలో నియమిస్తే వారికీ గౌరవ ప్రదమైన జీవితం ఉంటుంది. దీనివల్ల బిక్షాటన నుంచి విముక్తి దొరుకుతుంది. పనిచేసేందుకు మేమంతా సిద్ధంగానే ఉన్నాం. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కాకుండా రెగ్యులరైజ్డ్ ఉద్యోగాలు కల్పించాలని మా విజ్ఞప్తి. ఈ విషయంలోనూ ముఖ్యమంత్రిని కలిసి విన్నవించుకుంటాం.
అందరికీ న్యాయం అందేలా చూడాలి
` రచన, తెలంగాణ ట్రాన్స్‌జెండర్స్ పర్సన్స్ వెల్ఫేర్ బోర్డు మెంబర్
ట్రాన్స్‌జెండర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇందులో సమగ్రమైన విధివిధానాలు రూపొందించి అందరికీ న్యాయం దక్కేలా చూడాలి. గత బీఆర్‌ఎస్ సర్కారు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుచేసినప్పటికీ ప్రస్తుతం ఫండ్స్ లేక అది ఆగిపోయింది. దానికి బడ్జెట్ కేటాయించి ట్రాన్స్‌జెండర్లకు లబ్ది చేసేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు అంకితభావంతో పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నా.