ఎయిర్‌పోర్టులో ఉద్యోగాల ఆశతో మోసం

ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్‌
హైదరాబాద్‌,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాల ఆశచూపి…మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. డీసీపీ ప్రకాశ్‌గౌడ్‌ వివరాల మేరకు  నగర శివారు తుక్కుగూడలో ఉండే శ్రీకాకుళం వాసి టి. సంతోశ్‌కుమార్‌(24), మలక్‌పేట్‌కు చెందిన వి. రాంకుమార్‌(31), చార్మినార్‌ వాసి మహ్మద్‌ అబ్దుల్‌ ఖాదర్‌(32), సంతోశ్‌కుమార్‌ బావమర్ధి టి. నారాయణ(29), సరూర్‌నగర్‌కు చెందిన బి. పాండు(39) లు ముఠాగా ఏర్పడ్డారు. ప్రధాన సూత్రధారి సంతోశ్‌కుమార్‌ 2018లో హిమాయత్‌నగర్‌లో ఏవియేషన్‌ శిక్షణ పొందా డు. జాబ్‌కు యత్నించి విఫలమయ్యాడు. అయితే తనలా బాధపడేవారిని చేరదీసి… వారికి ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసేవాడు. తనకు ఉద్యోగం వచ్చిందని కుటుంబాన్ని నిజాంపేట నుంచి తుక్కుగూడకు మార్చాడు. సంతోశ్‌కుమార్‌తో కలిసి ముఠా సభ్యు లు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ మెయిల్స్‌ పంపడం, నకిలీ ఐడీ కార్డులు సృష్టించడంతో పాటు అమాయకులైన నిరుద్యోగులను చేరదీసి అందినకాడికి డబ్బులు వసూల్‌ చేస్తున్నారు. వీరి మోసాలను పసిగట్టిన కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అలా.. సుమారు రూ.30 లక్షల మేర వసూలు చేసినట్లు సమాచారం. ఎట్టకేలకు పోలీసులు రంగంలో దిగి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.