కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళన

– విధుల్లోకి చేరేందుకు డిపోల వద్ద బారులు

– బస్సులు బయటకు రాకుండా అడ్డగింత

– అడ్డుకున్న పోలీసులు.. కార్మికుల అరెస్ట్‌

హైదరాబాద్‌, నవంబర్‌27(జనం సాక్షి) : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల బతుకు పోరాటం కొనసాగుతోంది. విధుల్లోకి చేర్చుకోవాలని డిపోల ఎదుట కార్మికులు రెండో రోజు బుధవారం ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్దకు కార్మికులు చేరుకొని తమను విధుల్లోకి తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. డిపోల వద్ద భారీగా మోహరించిన పోలీసులు పలువురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తాత్కాలిక సిబ్బందితో యథావిధిగా ప్రత్యామ్నాయ బస్సులు నడుస్తున్నాయి. తాత్కాలిక సిబ్బంది ఐడీ కార్డులు పరిశీలించాకే అధికారులు విధుల్లోకి అనుమతిస్తున్నారు. సికింద్రాబాద్‌ హకీంపేట డిపో వద్ద ఆందోళనకు దిగిన కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. జేబీస్‌ వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంవగా ఆర్టీసీ కార్మికులు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా దూసుకొస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. తమ డ్యూటీలు తమకు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉధ్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు సుమఆరు 60మందికి పైగా పోలీసులను అరెస్ట్‌ చేశారు. అదేవిధంగా ఖమ్మం బురాన్‌పురంలో ఆర్టీసీ కార్మికుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేపట్టారు. ఓ ఇంట్లో సమావేశమైన ఐదుగురు మహిళా కార్మికులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీఐటీయూ ఆద్వర్యంలో హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించారు. ఇదిలా ఉంటే సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్‌ల ముట్టడి చేపట్టారు.