కొనుగోళ్లు లేక ఆగ్రహంతో రోడ్డెక్కిన అన్నదాత

ధాన్యం తగులబెట్టి నిరసన
విజయనగరం,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  ధాన్యం కొనుగోల్లు చేపట్టాలని కోరుతూ రైతులు రోడ్డెక్కారు.   మద్తు ధరలు ఇచ్చి కొనుగోలు చేయకుండా రైతులను ఇక్కట్ల పాలుచేస్తున్నారని మండపడుతున్నారు.  కష్టపడి పండించిన పంట కొనుగోలు కాకపోవడంతో కడుపు మండిన రైతన్నలు రోడ్డెక్కారు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. చీపురుపల్లి-గరివిడి మండలాల రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. విజయనగరం మూడు రోడ్ల జంక్షన్‌ లో రైతులంతా బైఠాయించి నిరసన తెలిపారు. గంటన్నరపాటు రాస్తారోకో నిర్వహించారు. ఆగ్రహించిన రైతన్నలు ధాన్యాన్ని తగులబెట్టి ఆందోళన చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. రైతులందరి నుండి ధాన్యాన్ని మిల్లుల యాజమాన్యాలు తీసుకున్నాయి. రైతులిచ్చిన ధాన్యానికి 50 శాతం మాత్రమే పేమెంట్‌ ఇచ్చి మిగిలిన 40 శాతం ధాన్యానికి పేమెంట్‌ ఇవ్వలేదు. ఆన్‌లైన్‌ కాలేదంటూ.. రైతులిచ్చిన ధాన్యాన్ని మిల్లుల్లోనే ఉంచారు. ఒక వైపు రావల్సిన సొమ్ము రాలేదు. మరో వైపు.. మిల్లుల్లో ధాన్యం నిల్వ ఉండి పాడైపోతుంది. కష్టపడి పండించిన పంటకు రావల్సిన సొమ్ము రాకపోగా, మిగిలిన ధాన్యాన్ని ఆన్‌లైన్‌ కాలేదంటూ నిల్వ ఉంచడం రైతులను ఆందోళన పరిచింది. కష్టపడినా కడుపు నిండా భోజనం కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని, పంట డబ్బు చేతికందక కష్టాల్లో కూరుకుపోతున్నామని రైతులంతా వాపోయారు. కడుపు మండిన రైతన్నలు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. ఆగ్రహంతో ధాన్యాన్ని తగులబెట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలని, రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.