కొలిక్కి రానున్న శాఖల సవిూకరణ

వ్యవసాయం, జలవనరులకు సమర్థల ఎంపిక

యాగం ముగిసిన తరవాతనే విస్తరణకు ఛాన్స్‌

హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ దృష్టిలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశాలు వ్యవసాయరంగం, సాగునీటి ప్రాజెక్టుల రంగం. వీటితో పాటు విద్యుత్‌ రంగం కూడా ప్రాదనా/-యం కలిగిన అంశగా ఉంది. వీటిని బలోపేతం చేయడం ద్వారా బంగారు తెలంగాణ దిశా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం సమర్థులైన వారిని ఎంచుకుని గత నాలుగున్నరేళ్లలో పురోగమించారు. వ్యవసాయరంగానికి చేపట్టిన కార్యక్రమాలను గత మంత్రివర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి సమర్థంగా నిర్వహించడంతో సిఎం కెసిఆర్‌కు పెద్దగా సమస్యలు లేకుంగా పోయాయి. ఇప్పుడు ఆ శాఖను మరో సమర్థుడైన వ్యక్తికి అప్పగించాల్సిఉంది. అలాగే నీటిపారుదల రంగాన్ని గతంలో హరీష్‌ రావు నిర్వహించారు. విద్యుత్‌ శాఖను జగదీశ్వర్‌ రెడ్డి నిర్వహించారు. దీంతో ఇప్పుడు ఈ రంగాలకు కొత్తవారిని నియమించే ఆలోచనలో సిఎం కెసిఆర్‌ ఉన్నట్లుగా సమాచారం. విస్తరణ ఎప్పుడు జరిగినా వీటి ప్రాధాన్యాలు గుర్తించి, వీటిని సమర్థంగా నిర్వహించే వారిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే మంత్రివర్గ విస్తరణలో కొంత ఆసల్యం జరుగుతోందన్న ప్రచారం కూడా ఉంది .తెలంగాణలో గత మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు వహించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈసారి సభాపతిగా బాధ్యతలు చేపడుతున్నారు. దీంతో కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రి ఎవరనే చర్చ మొదలైంది. వ్యవసాయ మంత్రిగా పోచారం తనదైన గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ రైతులకు నిరంతర విద్యుత్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. రుణమాఫీని అమలు చేశారు. రైతుబంధు, రైతు బీమా, రైతు వేదికలు, పంట కాలనీల ఏర్పాటు తదితర పథకాలను ప్రారంభించారు. రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. మంత్రి పోచారం వీటిని పర్యవేక్షించారు. పోచారాన్ని సీఎం పలుసార్లు ‘లక్ష్మీపుత్రుడు’ అని ప్రశంసించారు. రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయమంత్రిగా పోచారం పోటీలో ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆయన సభాపతి కావడంతో ఇప్పుడు ఆ శాఖ ఎవరికి దక్కుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ జాబితాలో గుత్తా సుఖేందర్‌రెడ్డి ముందంలో ఉన్నారని తెలుస్తోంది. ఆయన కాదనుకుంటే హరీష్‌ రావుకు కూడా అవకాశాలు ఉన్నాయి. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇప్పటికే రైతు సమన్వయ సమితి అధ్యక్షునిగా ఉన్నారు. ఎర్రబెల్లి, సింగిరెడ్డిలకు వ్యవసాయంపై అనుభవం ఉంది. ప్రశాంత్‌రెడ్డి, పల్లా సీఎం కేసీఆర్‌కు సన్నిహితులుగా ఉన్నారు. వీరిలో ఒకరికి అవకాశం లభిస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజామాబాద్‌ జిల్లా నుంచి పోచారానికి సభాపతి పదవి వచ్చినందున అదే జిల్లాకు చెందిన తనకు వ్యవసాయమంత్రి పదవి దక్కుతుందని ప్రశాంత్‌రెడ్డి ఆశతో ఉన్నారు. ఇకపోతే ఆర్థిక శాఖను గతంలో ఈటెల రాజేందర్‌ నిర్వహించారు. ఇప్పుడీ శాఖను ఐటితో కలపి కెటిఆర్‌కు ఇస్తారన్న ప్రచారం కూడా ఉంది. అసెంబ్లీ సమావేశాలు 20తో ముగుస్తాయి కనుక ఇక విస్తరణకు ఇప్పట్లో అవకాశం లేదు. 21 నుంచి కెసిఆర్‌ చండీయాగం చేయబోతున్నారు. దీంతో నెలాఖరుకు గానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటే ఉపసభాపతి, చీఫ్‌ విప్‌తో పాటు ముగ్గురు విప్‌ల పదవులను భర్తీ చేయాలని సీఎం భావిస్తున్నారు. ఎంపిక పక్రియపైనా ఇప్పటికే ఆయన దృష్టి సారించారు. భాపతి స్థానాన్ని అగ్రవర్ణాలకు కేటాయించినందున, ఉప సభాపతిగా బీసీలు లేదా ఎస్సీలకు అవకాశం ఇవ్వాలని సీఎం యోచిస్తున్నట్టు తెలిసింది. నిజానికి ఉప సభాపతి పదవికి మహిళా సభ్యురాళ్ల పేర్లను మొదట్లో సీఎం పరిశీలించారు. పోచారాన్ని సభాపతిగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఆ సవిూకరణం మారింది. మహిళా సభ్యుల్లో పద్మా దేవేందర్‌రెడ్డి, సునీతారెడ్డిలు ఓసీలు కాగా రేఖానాయక్‌ ఎస్టీ. ఈ ముగ్గురిలో ఒక్కరికి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం ఉంది. మంత్రి పదవి ఇస్తున్నందున ఉప సభాపతిగా మహిళేతరులకు అవకాశం ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. మిగిలిన ఇద్దరు మహిళా సభ్యుల్లో ఒకరికి పార్లమెంటరీ కార్యదర్శి, మరొకరికి శాసన సభలో విప్‌ పదవి దక్కే వీలున్నట్లు తెలిసింది. జనవరి 30, ఫిబ్రవరి 3,5,7వ తేదీల్లో విస్తరణ జరగొచ్చనే అంచనాలున్నాయి. విస్తరణ అనంతరం మిగిలిన ఎమ్మెల్యేలను పరిగణనలోనికి తీసుకొని పార్లమెంటరీ కార్యదర్శులతోపాటు, చీఫ్‌ విప్‌, విప్‌ల పదవులను భర్తీ చేయనున్నట్టు సమాచారం. ఈలోగా శాఖల పునరుద్దరణ అంశం కూడా కొలిక్కి రాగలదు.